Andhra Pradesh: రాయలసీమ గర్జన సభలో సొమ్మసిల్లి పడిపోయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

Baireddy Siddhartha collapsed in Rayalaseema Garjana Sabha
  • సభలో మాట్లాడిన తర్వాత  సంఘటన
  • కళ్లు తిరిగి పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా షాక్ 
  • కాసేపటికే తేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్న ఇతర నాయకులు
కర్నూలు వేదికగా జరుగుతున్న రాయలసీమ గర్జన సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సభకు హాజరైన వైసీపీ యువ నేత, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  కళ్లుతిరిగి పడిపోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఈ సభలో మాట్లాడిన తరువాత ఆయన ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన వైనం చూసి వేదికపై ఉన్న వాళ్లంతా షాక్ అవగా.. ఏం జరుగుతోందో అర్థంకాక సభకు వచ్చిన వాళ్లంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, సిద్ధార్థ రెడ్డి కాసేపటికే తేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతకముందు ఈ సభలో మాట్లాడిన సిద్ధార్ధ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, యువత చదువు, ఉద్యోగం కోసం.. హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ వెళ్లాలా? ఇక్కడి వారికి ఇక్కడే అవకాశాలు కలిపించవద్దా? అని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో ఒక రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినా..సీమ ఇప్పటికీ వెనుకబడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజధానిని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉంది. శ్రీశైలానికి భూములు ఇచ్చి రైతులు ఎంతో త్యాగం చేశారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు. అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయాలి’ అని సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh
Byreddy Siddharth Reddy
rayalaseema garjana
collapese
Chandrababu
kurnool

More Telugu News