రామచంద్రపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?: నాదెండ్ల మనోహర్

05-12-2022 Mon 14:14 | Andhra
  • జనసేన నేత రామచంద్ర నివాసంపై నిన్న రాత్రి దాడి
  • ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని నాదెండ్ల మండిపాటు
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే లేకుండా చేస్తున్నారని ఆగ్రహం
Nadendla Manohar condemns attack on Ramachandra
చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త, జనసేన నేత రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి దిగడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గంలో రైతు సభను నిర్వహించాలనుకోవడమే రామచంద్ర యాదవ్ చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఎదిరించి నిలబడితే ఆస్తులు ధ్వంసం చేస్తారా? అని అడిగారు. రామచంద్ర ఇంటిపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఆడుతున్న వికృత క్రీడలో భాగంగానే ఇదంతా జరుగుతోందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే లేకుండా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని అన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన తరపున రామచంద్రయాదవ్ పోటీ చేశారు. నియోజకవర్గంలోని రైతుల సమస్యలకు వ్యతిరేకంగా సదుంలో రైతుభేరి సభను తలపెట్టారు. దీనికి అనుమతి లేదని నిన్న పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా సభను తలపెట్టారంటూ నిన్న రాత్రి ఆయన ఇంటిపై దాడి జరిగింది. కర్రలు, రాళ్లతో తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న ఆరు కార్లను ధ్వంసం చేశారు. ఓ గదిలో ఉండి రామచంద్ర ప్రాణాలతో బయటపడ్డారు.