'మీర్జాపూర్' వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది

05-12-2022 Mon 13:34 | Entertainment
  • షూటింగ్ పూర్తి చేసిన చిత్రం బృందం
  • ఈ విషయాన్ని వెల్లడించిన గడ్డూ పండిట్ పాత్రధారి అలీ ఫజల్
  • చిత్ర బృందంతో దిగిన ఫొటో, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైనం
Mirzapurs Guddu Bhaiyya AKA Ali Fazal wraps up Mirzapur 3
అమెజాన్ ప్రైమ్ లో  స్ట్రీమ్ అయిన 'మీర్జాపూర్' మన దేశంలో అతి పెద్ద విజయం సాధించిన వెబ్ సిరీస్ గా అనేక రికార్డులు సృష్టించింది. తొలుత హిందీలో విడుదలైన ఈ సిరీస్ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో ప్రసారమైంది. అన్ని భాషల్లోనూ దీనికి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా గుడ్డూ పంటిట్ పాత్రలో అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి అద్భుత నటన కనబరిచారు. ఈ పాత్రలను ప్రేక్షకులను అంతగా సులభంగా మర్చిపోలేరు. తన అన్న, చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపడంతో రెండో సీజన్ పూర్తవగా.. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

వారికి అలీ ఫజల్ గుడ్ న్యూస్ చెప్పాడు. మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని వెల్లడించాడు. వెబ్ సిరీస్ బృందంతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గోలు గుప్తా పాత్రలో నటించిన శ్వేతా త్రిపాఠి ఇతర నటులు, సాంకేతిక సిబ్బంది షూటింగ్ పూర్తయిన సందర్భంగా గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే మీర్జాపూర్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2023లో ఈ సిరీస్ ను విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.