నయనతార నుంచి మరో హారర్ థ్రిల్లర్ .. 'కనెక్ట్' తెలుగు టీజర్ రిలీజ్!

05-12-2022 Mon 13:33 | Entertainment
  • నయనతార సొంత బ్యానర్లో 'కనెక్ట్'
  • ముఖ్య పాత్రల్లో అనుపమ్ ఖేర్ .. సత్య రాజ్
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల.  
Connect movie teaser released
నయనతారకి తెలుగు .. తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూనే .. మరో వైపున నాయిక ప్రధానమైన కథలను చేస్తూ వెళుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఆమె సినిమాలు విడుదలై భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ జోనర్స్ లో ఆమె తనదైన మార్కు వేసింది. ఆమె నుంచి ప్రేక్షకులను పలకరించడానికి మరో హారర్ థ్రిల్లర్ మూవీ రెడీ అవుతోంది .. ఆ సినిమాపేరే 'కనెక్ట్'. నయనతార సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను వదిలారు. కథను ఏ మాత్రం రివీల్ చేయకుండా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. పృథ్వీ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. అనుపమ్ ఖేర్ .. సత్యరాజ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.