డబ్బు విషయంలో శోభన్ బాబుకి ఒక సెంటిమెంట్ ఉండేది: చంద్రమోహన్

05-12-2022 Mon 13:12 | Entertainment
  • శోభన్ బాబుతో అనుబంధం గురించి ప్రస్తావించిన చంద్రమోహన్
  • తన చేత్తో డబ్బు తీసుకునేవాడని వెల్లడి 
  • శోభన్ బాబు నిర్వహణ గొప్పదని వ్యాఖ్య  
Chandra Mohan Interview
హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా చంద్రమోహన్ ఎన్నో సినిమాలు చేశారు. ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అలాంటి చంద్రమోహన్ తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి ప్రస్తావించారు. "నేను .. శోభన్ బాబు ఇద్దరం కూడా 'ఏరా .. ఏరా' అని పిలుచుకునేవాళ్లం. మా ఇద్దరి మధ్య అంత చనువు ఉండేది" అన్నారు. 

"నా చేతి మీదుగా డబ్బు తీసుకుని ఏదైనా కొంటే కలిసొస్తుందనే సెంటిమెంట్ శోభన్ బాబుకి ఉండేది. ఒకసారి ఆయన నాకు కాల్ చేసి అర్జెంటుగా రెండు లక్షలు కావాలంటే పంపించాను. 30 ఎకరాల తోటను కొనడానికిగాను అడ్వాన్సుగా ఇవ్వడానికి ఆ డబ్బు అడిగినట్టుగా ఆ తరువాత చెప్పాడు. స్వయంగా తీసుకెళ్లి ఆ తోటను చూపించాడు. పిల్లలందరి పెళ్లి ఆ తోటలోనే చేశాడు" అన్నారు. 

"ఒకసారి 'అన్నానగర్'లోని తన సొంత బిల్డింగ్స్ కి శోభన్ బాబు తన కారులో తీసుకుని వెళ్లాడు. అక్కడ ఒక్క చోటనే ఆయనకున్న ప్రాపర్టీస్ చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ఆస్తిపాస్తులపై పర్యవేక్షణకి గాను 25 నుంచి 30 మంది పనిచేస్తుంటారు. వాళ్లందరిపైన ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ పైన శోభన్ బాబు కొడుకు ఉండేవాడు. ఫైనల్ రిపోర్టు శోభన్ బాబు దగ్గరికి వచ్చేది. ఆయన నిర్వహణ చూసి షాక్ అయ్యాను" అంటూ చెప్పుకొచ్చారు.