చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి: విడదల రజని

05-12-2022 Mon 12:48 | Andhra
  • సీఎంగా ఉన్నప్పుడు యువతను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్న రజని 
  • బాబు హయాంలో ఒక్క ఆసుపత్రికి కూడా నిధులు ఇవ్వలేదని వెల్లడి  
  • బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శ 
Vidadala Rajini fires on Chandrababu
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతను నిర్వీర్యం చేశారని ఏపీ మంత్రి విడదల రజని విమర్శించారు. అలాంటి చంద్రబాబు నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్లించినట్టు ఉందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క ఆసుపత్రికి కూడా నిధులు ఇవ్వలేదని, నియామకాలు చేపట్టలేదని చెప్పారు. జగన్ పాలనలో వైద్య, ఆరోగ్యశాఖలో 46 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 4 లక్షలకు మందికి పైగా ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. 

అమరరాజా సంస్థ వ్యాపార విస్తరణ కోసం తెలంగాణకు వెళ్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని రజని విమర్శించారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన తర్వాత విశాఖకు తరలివస్తున్న పెట్టుబడులు, పరిశ్రమల గురించి తెలుసుకోవాలని సూచించారు. అదానీ, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు విశాఖలో పెడుతున్న పెట్టుబడులు చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 

బీసీలకు జగన్ బ్యాక్ బోన్ గా నిలిచారని... జగన్ పాలనలో బీసీలకు భరోసా దొరికిందని రజనీ అన్నారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని... బీసీలను ఓటు బ్యాంకు గానే చూశారని విమర్శించారు. బీసీలను వెనుకబడిన కులాలుగానే చూశారని అన్నారు. జగన్ బీసీలకు మంత్రి పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో పెద్ద పీట వేశారని కొనియాడారు.