నెయ్యి అందరికీ కాదు.. కొందరికే సూటబుల్!

05-12-2022 Mon 12:21 | Health
  • కాలేయ, జీర్ణాశయ సమస్యలున్న వారికి అనుకూలం కాదు
  • అధిక బరువు, గుండె జబ్బులున్నా దూరంగా ఉండాల్సిందే
  • కంటి ఆరోగ్యం, జ్ఞాపకశక్తికి నెయ్యితో ప్రయోజనాలు
Consuming ghee has some contraindications find out what they are
నెయ్యి ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెప్పడం వినే ఉంటాం. కానీ, మరోపక్క నెయ్యితో కొవ్వు పెరిగిపోతుందేమోనన్న భయంతో చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అయితే, నెయ్యితో ఎన్నో లాభాలు ఉన్నాయన్నది నిజం. కానీ, అదే సమయంలో నెయ్యిని అందరూ కాకుండా కొందరు మాత్రమే నిస్సంకోచంగా తినొచ్చు. కొందరు మాత్రం నెయ్యికి దూరంగా ఉండాలన్నది ఆయుర్వేద వైద్యుల సూచన.

నెయ్యి వల్ల లాభాలను గమనిస్తే.. ఇది వృద్ధాప్యాన్ని త్వరగా తెలియనివ్వదు. కంటి ఆరోగ్యానికి మంచి చేస్తుంది. జ్ఞాపకశక్తి, మేధస్సును పెంచడంలో సాయపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యం బాగుంటుంది. తేజస్సును పెంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి అని చెప్పి అందరూ దీన్ని తీసుకోవడం అనుకూలం కాదు.

  • దీర్ఘకాలికంగా జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ తదితర సమస్యలతో ఉన్నవారు నెయ్యిని తినకుండా ఉండడమే మంచిది. 
  • జ్వరం వచ్చిన సమయంలో నెయ్యి తినకూడదు. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే జ్వరాల సమయంలో నెయ్యికి దూరంగా ఉండాలి.
  • గర్భిణులుగా ఉన్నవారు..  అధిక బరువు ఉంటే (స్థూలకాయం) నెయ్యి వినియోగాన్ని తగ్గించుకోవాలి.
  • లివర్ సిర్రోసిస్, ఇతర కాలేయం, స్ప్లీన్ సమస్యలు ఉన్న వారు, కామెర్లు వచ్చిన వారు నెయ్యిని తినకూడదు.
  • ఆరోగ్యకరమైన ప్రతిదీ అందరికీ సరిపడాలని లేదని, తమ శరీర తత్వాలకు అనుకూలమైన వాటినే తీసుకోవాలన్నది ఆయుర్వేద వైద్యుల సూచన.
  • స్థూలకాయం, గుండె జబ్బులు ఉన్నవారు, గాల్ బ్లాడర్ తొలగించే శస్త్రచికిత్స చేయించుకున్న వారు నెయ్యిని తినకూడదు.