Jayalalitha: జయలలిత వర్ధంతి ఎప్పుడు?.. నిన్నా.. నేడా?: తెరపైకి సరికొత్త వివాదం

  • డిసెంబరు 5న మరణించిన జయలలిత
  • 4నే మరణించినట్టు అర్ముగస్వామి కమిషన్ నివేదిక
  • నిన్ననే నివాళులు అర్పించిన అన్నాడీఎంకే మాజీ ఎంపీ
  • ప్రభుత్వ ఆదేశాల్లో మార్పులు చేయాలని డిమాండ్
Controversy on Tamil Nadu Former CM Jayalalitha death Date

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఆమె మరణంపై నెలకొన్న వివాదం పూర్తిగా సద్దుమణగకముందే ఇప్పుడు ఆమె వర్ధంతి రూపంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. జయ వర్ధంతి డిసెంబరు 5న అని ఒకరు, కాదు, నిన్ననే అయిపోయిందని మరో వర్గం చెబుతోంది. జయలలిత మరణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అర్ముగస్వామి కమిషన్ జయలలిత డిసెంబరు 4న మృతి చెందినట్టు పేర్కొంది. అయితే, పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు దీనితో ఏకీభవించడం లేదు. 

అర్ముగస్వామి కమిషన్ పేర్కొన్న దాని ప్రకారం.. జయలలిత 4నే మృతి చెందినట్టు ప్రభుత్వ ఆదేశంలో మార్పు చేయాలని అన్నాడీఎంకే మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు, 100 మందితో కలిసి ఆయన నిన్ననే జయలలిత స్మారక మందిరంలో నివాళులు అర్పించారు. 

మరోవైపు, జయకు నేడు నివాళులు అర్పించేందుకు ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలతోపాటు శశికళ, దినకరన్ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే  మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి మాట్లాడుతూ.. అర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసింది ఎడప్పాడి పళనిస్వామేనని, కాబట్టి కమిషన్ చెప్పిన విషయాన్ని అంగీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో జయలలిత వర్ధంతిని ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై వివాదం రాజుకుంది.

More Telugu News