Navy Day: విశాఖ ఆర్కే బీచ్ లో నౌకాదళ విన్యాసాలు... హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu attends Navy Day celebrations at Viskha RK Beach
  • నేడు భారత నేవీ డే
  • విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే విన్యాసాలు
  • నేవీ ప్రచురణ ఆవిష్కరించిన రాష్ట్రపతి
  • అచ్చెరువొందించేలా నేవీ విన్యాసాలు
పాకిస్థాన్ తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించగా, ఈ ఘనతలో విశాఖ నేవీ స్థావరానికి కూడా కీలకపాత్ర ఉంది. తూర్పు తీరంలో ఉన్న భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను నాశనం చేయాలని పాకిస్థాన్ ఘాజీ అనే జలాంతర్గామిని పంపించింది. అయితే అది లక్ష్యం చేరకముందే విశాఖకు సమీపంలో పెద్ద పేలుడుతో సముద్ర జలాల్లో సమాధి అయింది. ఆనాటి విజయ ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబరు 4న నేవీ డే పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ఈ సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి విచ్చేసి లాంఛనంగా నేవీ డే విన్యాసాలను ప్రారంభించారు. ఆమెకు రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. నేవీ డేని పురస్కరించుకుని భారత నేవీ ప్రచురించిన ప్రత్యేక బ్రోచర్ ను ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా... నౌకాదళ సిబ్బంది సింధువీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. నేవీ సిబ్బంది అచ్చెరువొందించే రీతిలో విన్యాసాలు చేపట్టారు. చేతక్ హెలికాప్టర్లతో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ గగనవిహారం చేశారు. 

హెలికాప్టర్ నుంచి నేవీ మెరైన్ కమాండోలు జెమిని బోట్ల లోకి దిగారు. కమాండోలతో కూడిన ఆ బోట్లు ఎంతో వేగంగా తీరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా తీరంలో కమాండోలు యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలను ప్రదర్శించారు. మెరైన్ కమాండోలు ఓ యుద్ధ నౌకలోనూ విన్యాసాలు నిర్వహించారు. 

స్కై డైవర్ అనూప్ సింగ్ మువ్వన్నెల ప్యారాచూట్ తో బీచ్ లో దిగడం, నాలుగు యుద్ధ నౌకలపై ఒకేసారి హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్ చేపట్టడం చూపరులను ఆకట్టుకుంది. నేవీకి చెందిన మిగ్-29 యుద్ధవిమానాలు గగనతలంలో దూసుకెళ్లాయి. యుద్ధ విమానం నుంచి ఒకేసారి వెలువడిన కాంతిపుంజాలతో ఆకాశం వెలిగిపోయింది. యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ చేపట్టడాన్ని వీక్షకులు ఊపిరి బిగబట్టి తిలకించారు. 

ఈ విన్యాసాల్లో ఏఎల్ హెచ్ హెలికాప్టర్లు, అత్యాధునిక యూహెచ్ బీ హెలికాప్టర్లు కూడా పాల్గొన్నాయి. ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగివున్న అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా నేవీ డే విన్యాసాల్లో ప్రదర్శించారు. బోయింగ్ రేంజ్ పీఎస్ఐ విమానాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

యుద్ధ విమానాలు ఆకాశంలో వలయాకారంలో తిరుగుతూ విన్యాసాలు చేయడం ఆసక్తి కలిగించింది. ఈ సందర్భంగా తీరానికి కొద్ది దూరంలో సముద్ర జలాల్లో యుద్ధ నౌకలను మోహరించారు. వాటికి విద్యుద్దీపాలంకరణ చేయడంతో జిగేల్మమంటూ మెరిసిపోయాయి. 

కాగా, ఈ విన్యాసాలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా హాజరయ్యారు.
Navy Day
RK Beach
Droupadi Murmu
President Of India
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News