పుష్ప-2 భారత్, రష్యాలో ఒకేసారి విడుదల

03-12-2022 Sat 21:53 | Both States
  • రష్యా భాషలో విడుదలవుతున్న పుష్ప తొలి భాగం
  • ఈ నెల 8న రిలీజ్
  • ఈ నెల 1, 3 తేదీల్లో రష్యన్ నగరాల్లో ప్రీమియర్స్
  • పుష్ప టీమ్ కు రష్యాలో విశేష ఆదరణ
  • పుష్ప నిర్మాతల్లో కొత్త ఉత్సాహం 
Pushpa 2 will release in India and Russia same day
పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్టయిన పుష్ప చిత్రం రష్యాలోనూ విడుదలకు ముస్తాబవుతోంది. పుష్ప ఈ నెల 8న రష్యాలో విడుదల కానుంది. మాస్కోలో ఈ నెల 1న, సెయింట్ పీటర్స్ బర్గ్ లో నేడు ప్రీమియర్స్ ప్రదర్శించారు. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న, దేవిశ్రీప్రసాద్ తదితరులు రష్యాలోనే ఉండి ప్రీమియర్స్ కు హాజరయ్యారు.  

రష్యన్ భాషలో రూపొందించిన పుష్ప ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. కాగా, తమకు రష్యాలో లభిస్తున్న ఆదరణ పుష్ప టీమ్ లో మరింత ఉత్సాహం నింపింది. 

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత వై రవిశంకర్ ఆసక్తికర అప్ డేట్ వెల్లడించారు. పుష్ప-2 చిత్రాన్ని భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తామో, రష్యాలోనూ అదే తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. పుష్ప-2 చిత్రాన్ని భారత్ తో పాటు  పలు దేశాల్లో ఏకకాలంలో విడుదల చేయాలని భావిస్తున్నామని, ప్రస్తుతానికి ఈ జాబితాలో రష్యాను చేర్చామని రవిశంకర్ వివరించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పుష్ప-2 చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.