నేను పరాయిదాన్నయితే కేటీఆర్ భార్య కూడా పరాయి వ్యక్తే అవుతుంది: షర్మిల

03-12-2022 Sat 20:13 | Telangana
  • టీఆర్ఎస్ నేతలు తాలిబన్లలా మాట్లాడుతున్నారన్న షర్మిల 
  • మంత్రులు సచ్ఛీలత నిరూపించుకోవాలని డిమాండ్ 
  • తాను తెలంగాణ బిడ్డనే అని పునరుద్ఘాటన
Sharmila comments on TRS leaders
ఇటీవల వరంగల్ జిల్లాలో తన వాహనంపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి, హైదరాబాదులో చోటుచేసుకున్న పరిణామాలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఓ మీడియా సంస్థ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ, తప్పు చేసిన ఎవరినీ వదలకూడదన్నది తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు తాలిబన్లలా మాట్లాడుతున్నారని, అందుకే ఆ పార్టీని తాలిబన్ల రాష్ట్ర సమితి అన్నానని వివరణ ఇచ్చారు. 

అవినీతి జరిగిన ప్రతిచోట తాము మాట్లాడుతున్నామని షర్మిల వెల్లడించారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే నిజాయతీని నిరూపించుకోవాలని అన్నారు. నిజాయతీగా సమస్యలపై పోరాడుతున్నందునే వైఎస్సార్టీపీ ఈ స్థాయికి చేరిందని తెలిపారు. అంతేతప్ప వైఎస్సార్టీపీని హైలైట్ చేసేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానన్నది అవాస్తవం అని షర్మిల స్పష్టం చేశారు. నా ఆరోపణలపై రెచ్చిపొమ్మని టీఆర్ఎస్ నేతలకు నేను చెప్పానా? అంటూ ప్రశ్నించారు. 

తన పాదయాత్ర 2,500 కిమీ పూర్తయినప్పటి నుంచే తమపై దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. రెండు రోజుల్లోనే పార్టీ హైలైట్ అయిందన్న వాదనల్లో పస లేదని, పార్టీ ఈ స్థాయికి చేరడం వెనుక నెలల తరబడి కష్టం ఉందన్నారు. త్వరలోనే సీఎం అవుతానన్న నమ్మకం ఉందని అన్నారు. 

తనను పరాయి వ్యక్తి అంటున్నారని, తాను పరాయి వ్యక్తి అయితే కేటీఆర్ భార్య కూడా పరాయిదే అవుతుందని, ఆమె కూడా ఆంధ్రా వ్యక్తే అంటున్నారు కదా? అని షర్మిల వివరించారు. వీళ్లు ఎంతో గొప్ప తెలంగాణ వాదులైతే ఆమెను కూడా వెళ్లగొట్టాలి కదా... వీళ్లకో న్యాయం, మాకో న్యాయమా? అని నిలదీశారు. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే బిడ్డలను కన్నాను అని ఎన్నోసార్లు చెప్పానని వెల్లడించారు. 

తన వెనుక బీజేపీ ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ అని విమర్శించారు. వైఎస్సార్టీపీని స్థాపించింది మరే ఇతర పార్టీకో చాకిరీ చేయడానికి కాదని పేర్కొన్నారు.