ఇక ఓటీటీలో 'వరాహరూపం' ఒరిజినల్ సాంగ్... 'కాంతార'కు కోర్టులో క్లియరెన్స్

03-12-2022 Sat 19:47 | National
  • ఇటీవల విడుదలైన 'కాంతార'
  • దేశవ్యాప్తంగా సంచలన విజయం
  • ఇతర భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించిన కన్నడ చిత్రం
  • కొన్ని రోజుల కిందట ఓటీటీలో రిలీజ్
  • వరాహ రూపం సాంగ్ కాపీ అంటూ ఆరోపణలు
Kantara gets clearance for Varaha Roopam song
ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న చిత్రం కాంతార. భూత కోల, దైవ నర్తకుల కాన్సెప్టుతో వచ్చిన ఈ కన్నడ చిత్రం పలు భాషల్లో విడుదలై భారీ వసూళ్లు సాధించింది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాదు, ఇందులో ప్రధానపాత్ర పోషించాడు. 

కొన్నిరోజుల కిందటే ఈ చిత్రం ఓటీటీలోనూ విడుదలైంది. అయితే కాంతారలో ఎంతో హిట్టయిన వరాహరూపం సాంగ్ ఒరిజనల్ వెర్షన్ ఓటీటీలో కనిపించకపోవడంతో వీక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ పాట కాపీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో, కేరళ కోర్టు ఆంక్షలు విధించడంతో ఆ పాట లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వరాహరూపం ట్యూన్ ను మార్చి ఆ పాటను కొనసాగించినప్పటికీ అదేమంతగా ఆకట్టుకోలేదు. 

అయితే కోర్టులో కాంతార టీమ్ కు ఊరట కలిగింది. ఈ పాటపై గతంలో ఇచ్చిన స్టేను కోర్టు తాజాగా ఎత్తివేసింది. దీనిపై దర్శకహీరో రిషబ్ శెట్టి స్పందించారు. ప్రజల ప్రేమాభిమానాల ఫలితంగా కోర్టులో తమకు అనుకూల నిర్ణయం వచ్చిందని తెలిపారు. త్వరలోనే కాంతార ఓటీటీ వెర్షన్ కు వరాహరూపం ఒరిజినల్ సాంగ్ జత చేస్తామని వెల్లడించారు.