Ricky Ponting: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి మళ్లీ కామెంట్రీ షురూ చేసిన పాంటింగ్

Ricky Ponting feeling well now and continues commentary
  • ఆసీస్, విండీస్ టెస్టు సందర్భంగా ఘటన
  • కామెంటరీ చెబుతూ గుండెనొప్పితో బాధపడిన పాంటింగ్
  • వెంటనే ఆసుపత్రికి తరలింపు
  • చికిత్సతో కోలుకున్న వైనం
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కామెంటరీ చెబుతూ ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న పాంటింగ్ డిశ్చార్జి అయ్యాడు. అంతేకాదు, యథావిధిగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ కు కామెంట్రీ షురూ చేశాడు. 

ఈ సందర్భంగా పాంటింగ్ నిన్న తనకు ఎదురైన ఆందోళనకర అనుభవాన్ని పంచుకున్నాడు. "కామెంటరీ చెబుతుండగా ఛాతీలో సూదులతో గుచ్చినట్టు నొప్పి కలిగింది. దానికితోడు తల తిరుగుతున్నట్టు అనిపించడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాను. దాంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది" అని వెల్లడించాడు. నిన్న జరిగిన ఘటనతో తాను భయపడడమే కాకుండా, అనేకమందిని భయాందోళనలకు గురిచేశానని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. 

కాగా, ఛాతీ నొప్పితో బాధపడుతున్న పాంటింగ్ ను సహచరుడు జస్టిన్ లాంగర్, కామెంటరీ ప్రొడ్యూసర్ క్రిస్ జోన్స్ వెంటనే కామెంటరీ బాక్సు నుంచి కిందికి తరలించారు. ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్ లీ గోల్డింగ్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ గోల్డింగ్ ఆలస్యం చేయకుండా పాంటింగ్ ను స్టేడియం నుంచి ఆసుపత్రికి స్వయంగా తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం పాంటింగ్ ఆరోగ్యం కుదుటపడింది.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, రాడ్నీ మార్ష్ గుండెపోటుతోనే కన్నుమూసిన నేపథ్యంలో తాను ఆందోళనకు గురయ్యానని పాంటింగ్ వెల్లడించాడు. గత ఏడాదిన్నకాలంలో జరిగిన ఘటనల నేపథ్యంలో నిన్న ఎదురైన అనుభవం తనకు మేలుకొలుపు వంటిదని భావిస్తున్నానని వివరించాడు. తనను కేవలం 15 నిమిషాల్లోనే ఆసుపత్రికి చేర్చారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నాడు.
Ricky Ponting
Chest Pain
Hospital
Commentary
Australia
West Indies
Test

More Telugu News