ఓ చిన్నారి కాలేయ మార్పిడికి భరోసా ఇచ్చిన సీఎం జగన్

02-12-2022 Fri 22:10 | Andhra
  • కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి
  • పులివెందులలో పర్యటించిన సీఎం జగన్
  • సీఎంను కలిసిన చిన్నారి తల్లిదండ్రులు
  • అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చిన సీఎం
CM Jagan assures a child for liver transplantation
ఏపీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. వైద్య ఖర్చులకయ్యే మొత్తాన్ని భరిస్తామని అక్కడికక్కడే భరోసా ఇచ్చారు. 

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన యుగంధర్ రెడ్డి వయసు మూడున్నరేళ్లు. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లితండ్రులు బెంగళూరు కూడా తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో చూపించారు. సెయింట్ జాన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా, లివర్ బాగా దెబ్బతిన్నదని, మార్పిడి చేయాల్సి ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. 

ఇది ఖరీదైన వైద్య ప్రక్రియ కావడంతో యుగంధర్ రెడ్డి తల్లిదండ్రులు డీలాపడిపోయారు. ఈ నేపథ్యంలో వారు తమ బిడ్డను బతికించుకోవడం కోసం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలిశారు. ఆయన వెంటనే స్పందించి, కడప జిల్లాలో సీఎం పర్యటనకు వచ్చినప్పుడు ఆయన వద్దకు తీసుకెళతానని యుగంధర్ రెడ్డి తల్లిదండ్రులకు మాటిచ్చారు. 

ఈ క్రమంలో సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలోని పార్నపల్లె పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి తల్లిదండ్రులు సీఎం జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ బిడ్డను కాపాడాలని యుగంధర్ రెడ్డి తల్లి కన్నీరుమున్నీరైంది. 

ఆమెను ఓదార్చిన సీఎం జగన్... చిన్నారికి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును ఏపీ ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. సీఎం జగన్ తమ బిడ్డ ఆరోగ్యం పట్ల స్పందించిన తీరు ఆ పేద తల్లిదండ్రులను సంతోషానికి గురిచేసింది. వారు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.