"ప్రభాస్ కు జూబ్లీహిల్స్ లో ఫాంహౌస్"... స్పందించిన శోభు యార్లగడ్డ

02-12-2022 Fri 18:51 | Both States
  • ప్రభాస్ పై ఓ కథనం వైరల్
  • జూబ్లీహిల్స్ లో 84 ఎకరాల ఫాంహౌస్ ప్రభాస్ సొంతమని కథనం
  • కోటి రూపాయలకే కొనేశాడని వెల్లడి
  • ఏంటి... నిజమా అంటూ శోభు యార్లగడ్డ వ్యంగ్యం
Shobhu Yarlagadda reacts on rumors over Prabhas
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై అసత్య ప్రచారాలు, రూమర్లు మరింత పెరిగాయి. వాస్తవం కంటే ఊహాగానాలే త్వరగా వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా రంగుల ప్రపంచానికి చెందిన సినీ జీవులకు ఈ పుకార్ల బెడద ఎక్కువగా ఉంటుంది. 

తాజాగా, ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే... టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కు జూబ్లీహిల్స్ లో ఫాంహౌస్ ఉందట. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో, ప్రముఖులు ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 84 ఎకరాలు కొనేశాడట. అది కూడా కేవలం కోటి రూపాయలతో కొనేశాడట. ఇప్పుడా ఫాంహౌస్ విలువ రూ.60 కోట్లు ఉంటుందని ఆ కథనంలో పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ లో అన్ని ఎకరాల స్థలంలో ఫాంహౌస్ ఎక్కడ ఉందన్నది లాజిక్ కు అందని విషయం కాగా, దీనిపై ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ఏదో ఒక చెత్త వార్త రాసేసి దానికి ఒక సెలబ్రిటీ పేరు తగలించేస్తున్నారు... ఇదొక అలవాటైపోయిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో భూమి రేటెంతో తెలుసా అసలు? 84 ఎకరాలు అంటే మాటలా? అంటూ ఆ కథనాన్ని కొట్టిపారేశారు. 

కాగా, ప్రభాస్ ఫాంహౌస్ అంటూ వచ్చిన కథనానికి రాధేశ్యామ్ ఫొటోను వాడుకోగా, దీనిపై దర్శకుడు మారుతి సెటైర్ వేశారు. ప్రభాస్ విల్లాకు రాధేశ్యామ్ ఇంటీరియర్ డిజైనే వాడుతున్నారా? అని స్పందించారు.