బీసీలకు టీడీపీ కన్నతల్లి వంటిది... వైసీపీ సవతి తల్లి లాంటిది: అయ్యన్నపాత్రుడు

02-12-2022 Fri 17:41 | Andhra
  • ఈ నెల 7న బీసీ సభ నిర్వహిస్తున్న వైసీపీ
  • విమర్శనాస్త్రాలు సంధించిన అయ్యన్న
  • బీసీల పేరెత్తే అర్హత జగన్ కు లేదని స్పష్టీకరణ
  • జగన్ మోసపు రెడ్డి అంటూ విమర్శలు
Ayyanna slams YCP on BC issue
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ ఈ నెల 7న బీసీ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అయ్యన్న విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీలకు టీడీపీ కన్నతల్లి వంటిది అయితే, వైసీసీ సవతి తల్లి లాంటిదని అన్నారు. సీఎం జగన్ రెడ్డి పదవులన్నీ సొంత సామాజికవర్గానికే కట్టబెట్టాడని ఆరోపించారు. 

వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచాడని అయ్యన్న విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీనే అని ఉద్ఘాటించారు. బీసీల పదవులు, నిధులు దోచేసి, రిజర్వేషన్లకు కోత విధించిన వ్యక్తి జగన్ మోసపు రెడ్డి అని పేర్కొన్నారు. బీసీల ద్రోహి జగన్ రెడ్డికి వెనుకబడినవర్గాల పేరు ఎత్తే అర్హత లేదని అయ్యన్న స్పష్టం చేశారు.