రికీ పాంటింగ్ కు గుండెపోటు

02-12-2022 Fri 16:26 | Sports
  • కామెంట్రీ చెపుతూ గుండెపోటుకు గురైన పాంటింగ్
  • స్టేడియం నుంచి ఆసుపత్రికి తరలింపు
  • ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా రెండు ప్రపంచకప్ లను అందించిన పాంటింగ్
Ricky Ponting suffered heart attack and shifted to hospital
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కామెంట్రీ చెపుతుండగా ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఆయనను స్టేడియం నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. రికీ పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో క్రికెట్ ప్రపంచం, ఆయన అభిమానులు షాక్ కు గురయ్యారు. 

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలలో రికీ పాంటింగ్ ఒకరు. 1995 నుంచి 2012 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆస్ట్రేలియా తరపున 168 టెస్టుల్లో 13,378 పరుగులు... 375 వన్డేల్లో 13,704 పరుగులు చేశారు. టెస్టుల్లో 41 సెంచరీలు, వన్డేల్లో 30 శతకాలను సాధించారు. అంతేకాదు ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచ కప్ లను అందించిన కెప్టెన్ గా ఆయన ఘనతను సాధించారు.