Impact Player: ఐపీఎల్ లో ఫుట్ బాల్ రూల్ ప్రవేశపెడుతున్న బీసీసీఐ

  • ఇప్పటిదాకా ఫీల్డింగ్ కే పరిమితమైన సబ్ స్టిట్యూట్ ఆటగాళ్లు
  • సబ్ స్టిట్యూట్ కు ఐపీఎల్ లో కొత్త నిర్వచనం
  • సబ్ స్టిట్యూట్ తో బౌలింగ్, బ్యాటింగ్ చేయించుకునే వెసులుబాటు
  • వచ్చే సీజన్ నుంచి అమలు
BCCI introduces Impact Player concept in IPL from next season

ప్రతి ఏటా జనరంజకంగా సాగిపోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఓ కొత్త రూల్ తీసుకువస్తున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ 'సబ్ స్టిట్యూట్' విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా క్రికెట్లో 'సబ్ స్టిట్యూట్' అంటే, ఎవరైనా గాయపడితే వారి బదులు ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ, వచ్చే ఐపీఎల్ సీజన్ తో సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. ఐపీఎల్ లో 'సబ్ స్టిట్యూట్' తో బౌలింగ్, బ్యాటింగ్ చేయించుకోవచ్చు. 

ఈ సబ్ స్టిట్యూట్ ను 'ఇంపాక్ట్ ప్లేయర్' అని పిలుస్తారు. టాస్ సమయంలో ఒక్కో జట్టు 'ఇంపాక్ట్ ప్లేయర్' కోటాలో నలుగురి పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగే సమయంలో ఆ నలుగురిలో ఒకరిని 'సబ్ స్టిట్యూట్' గా బరిలో దింపి బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయించుకోవచ్చు. అయితే ఏ ఇన్నింగ్స్ లో అయినా 14వ ఓవర్ ముగియడానికి ముందే ఈ 'సబ్ స్టిట్యూట్' ను బరిలో దింపాల్సి ఉంటుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఫుట్ బాల్ లో ఈ 'సబ్ స్టిట్యూట్' విధానం అమల్లో ఉంది. మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు ఆయా జట్ల కోచ్ లు మైదానంలో అలసిపోయిన ఆటగాడిని బయటికి పిలిపించి, అతడి స్థానంలో 'సబ్ స్టిట్యూట్' ను పంపించడం తెలిసిందే. ఎలాంటి అలసట లేకుండా తాజాగా ఉన్న ఆ 'సబ్ స్టిట్యూట్' ఆటగాళ్లు గోల్స్ కొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పిన సందర్భాలు కోకొల్లలు.

ఇప్పుడు ఐపీఎల్ లోనూ 'సబ్ స్టిట్యూట్' నిబంధన మ్యాచ్ స్వరూపాన్ని మార్చేదిగా భావిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఐపీఎల్ లో ప్రతి జట్టులో 12 మంది ఆడుతున్నట్టే లెక్క. కాగా, ఈ 'ఇంపాక్ట్ ప్లేయర్' విధానాన్ని బీసీసీఐ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఐపీఎల్ లోనూ ఈ కొత్త నిబంధన విజయవంతం అవుతుందని బోర్డు ధీమా వ్యక్తం చేస్తోంది.

More Telugu News