ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ కు ఊరట

02-12-2022 Fri 13:07 | Andhra
  • లోకేశ్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు
  • 2021 జూన్ లో అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు వచ్చిన సమయంలో కేసు నమోదు
  • లోకేశ్ పై కేసును కొట్టేసిన హైకోర్టు
Big relief to Nara Lokesh in AP High Court
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే... విజయవాడ సూర్యారావుపేటలో ఈ కేసు నమోదైంది. 2021 జూన్ లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి శ్రీకాకుళం జిల్లాలోని ఆయన నివాసం నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు సూర్యారావుపేట కోర్టు సెంటర్ కి లోకేశ్ వచ్చారు. దీంతో, కోవిడ్ నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసు విచారణకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో విజయవాడ మొదటి అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి లోకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టి వేయాలని తన పిటిషన్ లో కోరారు. లోకేశ్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను వినిపించారు. వాదనలను విన్న హైకోర్టు కేసును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.