మెగా హీరోతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ!

  • చరణ్ సరసన హీరోయిన్ గా పరిశీలన
  • ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమాకు ఓకే చెప్పిన చెర్రీ
  • పుష్ప2లో ప్రత్యేక పాట కోసం జాన్వీ పేరు పరిశీలన
Janhvi Kapoor To Make Tollywood Debut Opposite Ram Charan

ప్రముఖ నటి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ కు పరిచయం అయిన జాన్వీ కపూర్ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. చెప్పుకోదగ్గ విజయాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. గ్లామర్ పాత్రలతోపాటు గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలీ లాంటి కథా బలమున్న సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆమె త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. 

వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తొలి చిత్రంగా ఈ భారీ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే చెర్రీ ఈ చిత్రంలో నటించనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారు. ఇందుకోసం జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిన చరణ్ సరసన అవకాశం అంటే జాన్వీకి లక్కీ చాన్స్ అనొచ్చు. 

మరోవైపు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న పుష్ప2 లో ప్రత్యేక పాట కోసం కూడా జాన్వీ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తొలి పార్టులో సమంత చేసిన ప్రత్యేక పాట చాలా పాప్యులర్ అయింది. ఇప్పుడు ఆ అవకాశం జాన్వీ తలుపు తట్టనుంది. చరణ్ సినిమాలో హీరోయిన్ గా చేసినా, పుష్ప2లో ప్రత్యేక పాటకు ఓకే చెప్పినా.. మెగా కాంపౌండ్ నుంచే జాన్వీ టాలీవుడ్ కు పరిచయం అవనుంది.

More Telugu News