Andhra Pradesh: పోలవరం వద్ద హైటెన్షన్... ప్రాజెక్టు ముందు రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

tdp chief chandrababu naidu sits before polavaram project
  • సాయంత్రం పోలవరం సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత
  • పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదన్న పోలీసులు
  • నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉందని వెల్లడి
  • నిరాకరణకు కారణాలను లిఖితపూర్వకంగా రాసివ్వాలన్న బాబు 
  • పోలీసులు నిరాకరించడంతో అక్కడే బైఠాయించిన టీడీపీ అధినేత 
ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వద్ద గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సాయంత్రం వేళ... పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం పోలవరం గ్రామం వద్దకు చేరుకున్నారు. 

అయితే పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ఏ ఒక్కరికి అనుమతి లేదంటూ పోలీసులు అప్పటికే పోలవరం ప్రాజెక్టు ముఖద్వారం వద్ద భారీ వాహనాలతో ఓ బారికేడ్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే చంద్రబాబు అక్కడకు చేరుకోవడం, పోలవరం సందర్శనకు ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు చెప్పడంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఓ సందర్భంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాను చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తనకే అనుమతి ఇవ్వరా? అని పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. అయితే నక్సలైట్లకు చెందిన వారోత్సవాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో చంద్రబాబుకు నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పిన పోలీసులు.. ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబుకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. అయితే చంద్రబాబుతో పాటు మరో ఐదుగురు నేతలకు అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు. అందుకు కూడా పోలీసులు తిరస్కరించడంతో చంద్రబాబు పోలవరం ముఖద్వారం వద్దే రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఆయన వెనుకే బైఠాయించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అసలు తాను పోలవరం ప్రాజెక్టును ఎందుకు సందర్శించకూడదో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని చంద్రబాబు పోలీసులను కోరారు. దీంతో నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉందన్న విషయాన్నే మరోమారు చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను చాలా సార్లు పోలవరాన్ని పరిశీలించానని, కొన్ని సందర్భాల్లో రాత్రి వేళల్లో కూడా ఇక్కడే బస చేశానని చంద్రబాబు చెప్పారు. నాడు లేని ముప్పు ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన పోలీసులను నిలదీశారు. 

అనంతరం గురువారం కాకపోతే... శుక్రవారం అయినా, లేదంటే శనివారం అయినా తాను పోలవరాన్ని పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. దీనికి కూడా పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైఠాయించారు. పోలవరం సందర్శనకు తనను అనుమతించేదాకా అక్కడి నుంచి లేచేది లేదంటూ చంద్రబాబు భీష్మించారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
Andhra Pradesh
Polavaram Project
TDP
Chandrababu
West Godavari District
AP Police

More Telugu News