ఆ డైలాగ్ ఏ హీరోను ఉద్దేశించి పెట్టింది కాదు: కృష్ణవంశీ

30-11-2022 Wed 20:23 | Entertainment
  • కృష్ణవంశీ తాజా చిత్రంగా రూపొందిన 'రంగమార్తాండ'
  • గత చిత్రాల గురించి ప్రస్తావించిన కృష్ణవంశీ 
  • తన సినిమాలకి సీక్వెల్ చేసే ఆలోచన లేదని వెల్లడి   
Krishna vamsi Interview
కృష్ణవంశీ నుంచి ఈ మధ్య కాలంలో ఏ సినిమా రాకపోవచ్చు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుతోనే ఆయనను గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అందుకు కారణం అంతకుముందు ఆయన నుంచి వచ్చిన సినిమాలే. అవి సాధించిన ఘనవిజయాలేనని చెప్పచ్చు. 

తెలుగు సినిమా కథలను తెరపై కొత్తగా ఆవిష్కరించిన కృష్ణవంశీ కెరియర్ ఆరంభంలోనే తనదైన ముద్రను వేశారు. ఆయన నుంచి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగమార్తాండ' సినిమా రెడీ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. 

'ఖడ్గం' సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ ను ఆ పాత్రను బట్టి పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోను ఉద్దేశించి ఆ డైలాగ్ పెట్టలేదు. అప్పట్లో కొంతమంది అలా చెప్పుకున్నారుగానీ, అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. అదంతా కేవలం ప్రచారం మాత్రమే" అన్నారు. 

"నేను ఇంతకుముందు చేసిన సినిమాలు ఇప్పుడు టీవీలో చూస్తే, టెక్నికల్ గా ఇంకాస్త బెటర్ గా చేస్తే బాగుండునే అనుకుంటాను. ఆ సినిమాలకి సీక్వెల్ చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు .. అలాంటి ప్రయత్నం చేసే ఉద్దేశం కూడా లేదు" అంటూ చెప్పుకొచ్చారు.