'క్షణం' తరువాత నేను తీసుకున్న నిర్ణయం అదే!: అడివి శేష్

30-11-2022 Wed 15:36 | Entertainment
  • డిసెంబర్ 2న రిలీజ్ కానున్న 'హిట్ 2'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అడివి శేష్ 
  • తనకి నచ్చని కథలు చేయనని వ్యాఖ్య 
  • తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలే చేస్తానని వెల్లడి
Adivi Sesh Interview
అడివి శేష్ చాలా చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ ను మొదలుపెట్టి హీరోగా ఎదిగాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. ఆ తరహా కథలు తనని వెదుక్కుంటూ వచ్చేలా చేసుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'హిట్ 2' వచ్చేనెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. 

తాజా ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడూతూ .. "మొదటి నుంచి కూడా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాను. శేష్ ఒక సినిమా చేశాడంటే అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుందనే నమ్మకాన్ని జనంలో కలిగిస్తూ వెళుతున్నాను. నా 12 ఏళ్ల ఈ ప్రయాణంలో ఈ విషయంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాను" అన్నాడు. 

'క్షణం' సినిమాకి ముందు ఎవరు ఎలాంటి కథ చెప్పినా, నాకు ఏ రకంగానైనా ఉపయోగపడుతుందేమో అనే ఒక ఆలోచనతో ఒప్పుకునేవాడిని. కానీ 'క్షణం' కథ నా మనసుకు నచ్చడం వలన చేశాను .. అది వర్కౌట్ కావడంతో, ఇకపై నా మనసుకు నచ్చని కథలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఒక్కోసారి కథ నచ్చినప్పటికీ, అందులో నేను సెట్ కానని అనిపిస్తే కూడా వదులుకున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.