ప్రభాస్​ తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్​ నటి ​

30-11-2022 Wed 11:47 | Entertainment
  • ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు
  • ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మొదలైన పుకార్లు
  • తమ మధ్య ఏమీ లేదని స్పష్టం చేసిన కృతి సనన్
Kriti Sanon On Those Prabhas Rumours
మహేశ్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో వెండితెరకు పరిచమైంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. తెలుగులో అరంగేట్రం చేసిన ఈ ముంబై ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, కృతి సీత పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రెయిలర్ లాంచ్,  ప్రమోషన్లలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. 

ఈ క్రమంలో  వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పుకార్లు మొదలయ్యాయి.  సినిమా సమయంలో ప్రభాస్, కృతి సనన్ మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకార్లు వస్తున్నాయి.

పైగా, ఈ మధ్య ‘బేధియా’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ షోలో పాల్గొన్న కృతి సనన్ పై మరో యువ హీరో వరుణ్ ధావన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. కృతి సనన్ మనసు ఇక్కడ లేదు, దీపికా పదుకొణేతో నటిస్తున్న ఒక నటుడి వద్ద ఉంది.. అంటూ పరోక్షంగా ప్రభాస్ ప్రస్తావన తెచ్చాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. 

దీంతో ఈ విషయంలో ఎట్టకేలకు కృతి సనన్ స్పందించింది. ప్రభాస్ తో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. ‘బేధియా’ ప్రమోషన్ లో సదరు రియాలిటీ షోలో హీరో వరుణ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇలాంటి పుకార్లకు దారి తీశాయని చెప్పింది. ఏదో న్యూస్ పోర్టల్ తన పెళ్లి తేదీ ప్రకటించకముందే దీనిపై క్లారిటీ ఇస్తున్నట్టు తెలిపింది. తమ విషయంలో వస్తున్న పుకార్లన్నీ అర్థరహితం అని స్పష్టం చేసింది.