మళ్లీ ఉసూరుమనిపించిన పంత్.. 10 పరుగులకే పెవిలియన్‌కు

30-11-2022 Wed 09:10 | Sports
  • న్యూజిలాండ్‌తో మూడో వన్డే 
  • విజృంభిస్తున్న కివీస్ బౌలర్లు
  • క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్న టీమిండియా
Rishabh Pant Once Again Failed in Crease
అభిమానులు, టీం మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరోమారు వమ్ము చేశాడు. న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న మూడో వన్డేలోనూ పేలవ ఫామ్‌ను కొనసాగించిన పంత్ 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఇబ్బందిగా కదిలిన పంత్ రెండు బంతులను బౌండరీలకు పంపినప్పటికీ కుదురుకోలేకపోయాడు. డరిల్ మిచెల్ బౌలింగులో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభం కలిసిరాలేదు. 39 పరుగుల వద్ద ఓపెనర్ శుభమన్ గిల్ (13) అవుటయ్యాడు. ఆ తర్వాత 55 పరుగుల వద్ద కెప్టెన్ శిఖర్ ధావన్ (28) కూడా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో తమ బంతులకు మరింత పదునుపెట్టిన కివీస్ బౌలర్లు పంత్, సూర్యకుమార్ యాదవ్ (6)లను కూడా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌పై పట్టు సాధించారు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిశాయి. టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (49), దీపక్ హుడా (1) క్రీజులో ఉన్నారు.