శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణంలో భారీ చోరీ.. రూ. 11.57 లక్షల విలువైన బాటిళ్ల అపహరణ

30-11-2022 Wed 07:39 | Andhra
  • లావేరు మండలం గుంటుకుపేటలో ఘటన
  • వ్యానులో వచ్చిన 11 మంది దుండగులు
  • కాపాలాదారులను సమీపంలోని తోటకు తీసుకెళ్లి బంధించిన వైనం
  • అనంతరం దుకాణానికి రంధ్రం చేసి మద్యం బాటిళ్ల తరలింపు
  • దుండగుల కోసం గాలిస్తున్న 6 బృందాలు 
Massive theft in liquor shop in Srikakulam district Laveru
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని ఓ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. రూ. 11.57 లక్షల విలువైన మద్యం బాటిళ్లను దుండగులు అపహరించుకుపోయారు. జిల్లాలోని లావేరు మండలం మురపాక పంచాయతీలోని గుంటుకుపేటలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిందీ ఘటన. రాత్రి రెండు గంటల సమయంలో మద్యం వ్యానులో దుకాణం వద్దకు చేరుకున్న 11 మంది అక్కడ కాపలాగా ఉన్న ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి బంధించారు. 

వారి వద్దనున్న సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, తాళాలు లాక్కున్నారు. అనంతరం వారి వద్ద ముగ్గురు వ్యక్తులు కాపలాగా ఉండగా, మిగిలినవారు దుకాణం వద్దకు వెళ్లి చోరీకి పాల్పడ్డారు. దుకాణం గోడకు రంధ్రం చేసి అందులోంచి 7087 మద్యం సీసాలను తరలించారు. ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం ఆరు బృందాలతో గాలిస్తున్నారు.