న్యూజిలాండ్‌తో చివరి వన్డే: ఆలస్యంగా టాస్.. భారత్‌ బ్యాటింగ్

30-11-2022 Wed 07:05 | Sports
  • వర్షం కారణంగా చిత్తడిగా మారిన మైదానం
  • ఈ పర్యటనలో వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు రద్దు
  • ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం
Kiwis won the toss and opt to bowl
భారత్-న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఉదయం నుంచి చిన్నగా వర్షం పడుతుండడంతో టాస్ ఆలస్యమైంది. పిచ్‌పై కవర్లు ఇంకా కప్పే ఉన్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత హమిల్టన్‌లో జరిగిన రెండో వన్డేకు వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు నేటి మ్యాచ్ కీలకంగా మారింది. భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. న్యూజిలాండ్ మాత్రం ఒకే ఒక్క మార్పుతో ఆడుతోంది. బ్రాస్‌వెల్ స్థానంలో మిల్నే జట్టులోకి వచ్చాడు.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా యోచిస్తోంది. ఇక, ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా వర్షం అడ్డంకులు సృష్టించింది. వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా, మౌంట్ మాంగనూయిలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేపియర్‌లో జరిగిన మూడో మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ డక్‌వర్త్ లూయిస్ విధానంలో విజయం భారత్‌ను వరించింది. దీంతో టీ20 సిరీస్ భారత్ సొంతమైంది.