నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిల.. రిమాండ్ పై సుదీర్ఘంగా కొనసాగుతున్న వాదనలు

29-11-2022 Tue 21:58 | Telangana
  • షర్మిల దురుసుగా వ్యవహరించారన్న పోలీసులు
  • పోలీసు అధికారి చేతిలోని సెల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపణ
  • అసభ్య పదజాలాన్ని కూడా వాడారని కోర్టుకు తెలిపిన పోలీసులు
  • షర్మిలను రిమాండ్ కు తరలించకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందని వెల్లడి
  • అకారణంగా అరెస్ట్ చేశారని షర్మిల తరఫు న్యాయవాదులు
ts police produces ys sharmila in nampally court
పాదయాత్రలో తనను అడ్డుకుని దాడికి యత్నించిన టీఆర్ఎస్ శ్రేణుల వైఖరిని నిరసిస్తూ... దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతి భవన్ కు వెళ్లేందుకు యత్నించగా... హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించగా,... ఆమె కారులో కూర్చుని ఉండగానే... క్రేన్ సాయంతో కారును ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆపై పంజాగుట్ట పీఎస్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. 

మంగళవారం సాయంత్రం దాకా ఎస్ ఆర్ నగర్ పీఎస్ లోనే షర్మిలను ఉంచిన పోలీసులు... వైద్యులను పోలీస్ స్టేషన్ కే రప్పించి... షర్మిలకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని షర్మిలను రిమాండ్ కు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. అయితే షర్మిల ఏమీ తప్పు చేయలేదని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రగతి భవన్ కు వెళుతుంటే...పోలీసులు అకారణంగా ఆమెను అరెస్ట్ చేశారని షర్మిల తరఫు న్యాయవాదులు వాదించారు. పోలీసులు నమోదు చేసిన కేసులకు, చెబుతున్న కారణాలకు అసలు పొంతనే లేదని కూడా వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. షర్మిల తమపై దురుసుగా ప్రవర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. షర్మిల అసభ్య పదజాలం వినియోగిస్తున్న సమయంలో వీడియో తీసేందుకు యత్నించిన పోలీసు అధికారి నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపించారు. ఈ చర్య ద్వారా షర్మిల పోలీసు అధికారి విధులను అడ్డుకున్నట్టేనని కూడా తెలిపారు. 

షర్మిల, ఆమె అనుచరులు ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో హల్ చల్ చేశారని, శాంతి భద్రతలను పరిరక్షించేందుకే ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. షర్మిలను రిమాండ్ కు తరలించకుంటే నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కూడా పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వాదనలు ముగిస్తే గానీ షర్మిలను కోర్టు రిమాండ్ కు పంపుతుందా? లేదా? అన్నది తేలుతుంది.