సర్పంచులపై సర్పంలా బుసకొడుతున్న జగన్ పతనం తప్పదు: నారా లోకేశ్

29-11-2022 Tue 21:42 | Andhra
  • తిరుపతిలో సర్పంచుల శంఖారావం భగ్నం
  • సర్పంచులకు మద్దతు ప్రకటించిన లోకేశ్
  • సర్పంచులపై ఉక్కుపాదం మోపుతోందని ప్రభుత్వంపై ఆగ్రహం
  • సర్పంచులకు టీడీపీ అండగా ఉంటుందని హామీ
Nara Lokesh furious on CM Jagan
పంచాయతీల నిధులు, విధులు మింగేసిన సర్కారు సర్పంచులపై ఉక్కుపాదం మోపుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్కారు తీరుపై సర్పంచులు శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమాన్ని పోలీసు బలగాలతో భగ్నం చేయడం జగన్ రెడ్డి సర్కారు నియంతృత్వ తీరుకి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులపై సర్పంలా బుసకొడుతున్న జగన్ పతనం తప్పదు అని హెచ్చరించారు. 

తిరుపతిలో గురువారం ప్రారంభమైన 'గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం' కార్యక్రమానికి హాజరు కాకుండా చాలామంది సర్పంచులను ఎక్కడికక్కడే నిర్బంధించారని, మరికొందరిని అరెస్టు చేశారని లోకేశ్ ఆరోపించారు. తిరుపతిలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‍, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి ఇతర నేతలని అరెస్టు చేయడాన్ని ఖండించారు. 

ఏపీ సర్కారు ఖజానాకి మళ్లించిన రూ.8660 కోట్ల ఆర్థిక సంఘం నిధులు తిరిగి సర్పంచుల పీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో  జమ చేయాలని, గ్రామ సచివాలయాలను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలని, సర్పంచులు,ఎంపీటీసీలకు రూ.15 వేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు రూ.30,000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, నరేగా నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని, పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే డిమాండ్లతో సర్పంచులు శంఖారావం కార్యక్రమం నిర్వహిస్తున్నారని వెల్లడించారు. 

న్యాయమైన డిమాండ్ల సాధనకి తలపెట్టిన సర్పంచుల శంఖారావాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన సర్కారు పతనం తప్పదని లోకేశ్ హెచ్చరించారు. నిధులు, హక్కుల కోసం పార్టీలకు అతీతంగా సర్పంచుల సంఘం, పంచాయతీ చాంబర్ చేస్తున్న న్యాయమైన పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా వుంటుందని పేర్కొన్నారు.