Telangana: ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యే: కల్వకుంట్ల కవిత

  • దీక్షా దివస్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై కవిత కౌంటర్లు
  • కాంగ్రెస్ పార్టీ చేసిన జాప్యం వల్లే బలిదానాలు జరిగాయని ఆరోపణ
  • రాహుల్ గాంధీ వయనాడ్ లో పోటీ చేయడాన్ని ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ
mlc kavitha hits back on congress party over deeksha divas

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునే ఉద్యమంలో భాగంగా సిద్దిపేట కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భంగా ఆ దీక్ష జరిగిన నవంబర్ 29ని టీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ గా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో దీక్షా దివస్ సందర్భంగా మంగళవారం సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ట్వీట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యేనని ఆమె ఆరోపించారు. 

తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని కవిత ఆరోపించారు. ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆమె విమర్శించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇస్తామని చెప్పిన తర్వాత ఆ దిశగా రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేసిన కారణంగానే వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేశారన్నారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సొంత నియోజకవర్గం అమేథిలో గెలిచే నమ్మకం లేక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ వెళ్లారన్న కవిత.. నిజామాబాద్ లో ఎంపీగా ఓడినా... అక్కడే ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచానని తెలిపారు.

More Telugu News