China: చైనాలో కరోనా కలకలం... ఆక్సిజన్ యంత్రాలకు భారీగా పెరిగిన డిమాండ్

  • చైనాలో నిన్న ఒక్కరోజే 40 వేలకు పైగా కేసుల నమోదు
  • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల లేమి
  • లైఫ్ సేవింగ్ పరికరాల కొనుగోళ్లకు సిద్ధమవుతున్న చైనీయులు
Corona cases increasing in China

చైనాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన కరోనా ఆంక్షల పట్ల అక్కడి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీరో కొవిడ్ పాలసీ విషయంలో చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గుతోంది. ఇదే సమయంలో లాక్ డౌన్లను ఎత్తేస్తే కొవిడ్ కేసులు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతాయని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

ఇంకోవైపు చైనాలో పెరుగుతున్న కరోనా కేసులతో వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. బ్రిటన్ డైయిలీ ఫైనాన్సియల్ టైమ్స్ కథనం మేరకు చైనాలో 1.20 కోట్ల మంది వీటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. 

చైనాలో కేవలం నగరాల్లోనే మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అరకొర సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. దీంతో, అక్కడి పౌరులు ముందు జాగ్రత్త చర్యగా లైఫ్ సేవింగ్ పరికరాల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. 

ఇదిలావుంచితే, చైనాలో నిన్న ఏకంగా 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. ఆందోళనకారులపై బాష్పవాయుగోళాలను, పెప్పర్ స్ప్రేలను ప్రయోగిస్తున్నారు. ఈ అణచివేత చర్యలను ఐక్యరాజ్యసమితి ఖండించింది. శాంతియుతంగా ఆందోళన చేసేవారి హక్కులను గౌరవించాలని సూచించింది. చైనాలో జరుగుతున్న ప్రజాందోళనలకు మద్దతుగా శాన్ ఫ్రాన్సిస్కో, టొరెంటో, డబ్లిన్, ఆమ్స్ టర్ డామ్, పారిస్ తదితర నగరాల్లో సైతం నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

More Telugu News