వైసీపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

29-11-2022 Tue 15:49 | Andhra
  • ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలకు వెళుతున్న చంద్రబాబు
  • ఈ నెల 30 నుంచి డిసెంబరు 2 వరకు పర్యటన
  • పర్యటన అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్న వర్ల
  • పర్యటనకు అవాంతరాల్లేకుండా చూడాలని డీజీపీకి వినతి
TDP leader Varla Ramaiah complains against YCP leaders to DGP
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 30 నుంచి డిసెంబరు 2 వరకు ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వైసీపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. 

చంద్రబాబు పర్యటనను భగ్నం చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ శ్రేణులు, సంఘ విద్రోహులు చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు కలిగించే అవకాశాలున్నాయని తెలిపారు. ఆయన పర్యటనలో హింసను ప్రేరేపించేందుకు వారు యత్నిస్తున్నట్టు తెలిసిందని ఆరోపించారు. పర్యటనకు ఏలూరు పోలీసుల అనుమతి తీసుకున్నామని వర్ల రామయ్య స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటనకు అవాంతరాలు లేకుండా చూడాలని డీజీపీని కోరారు.