YSRTP: గృహ నిర్బంధంలో వైఎస్ విజయమ్మ... పోలీసుల చర్యకు నిరసనగా దీక్షకు దిగిన షర్మిల తల్లి

ys vijayamma starts deeksha to protest house arrest
  • వైఎస్ షర్మిల వద్దకు బయలుదేరిన విజయమ్మ
  • లోటస్ పాండ్ లోని ఆమె ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు
  • గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటన
  • పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగిన విజయమ్మ
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. తన పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా.. దాడిలో ధ్వంసమైన కారులో మంగళవారం మధ్యాహ్నం షర్మిల ప్రగతి భవన్ కు బయలుదేరగా... పంజాగుట్ట చౌరస్తా వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను సాయంత్రం దాకా పోలీసులు తమ అదుపులోనే ఉంచుకోనున్నారు. 

ఈ నేపథ్యంలో కుమార్తె వద్దకు బయలుదేరిన వైఎస్ విజయమ్మను లోటస్ పాండ్ లోని ఆమె ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్ లో పోలీసులతో విజయమ్మ తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు. 

తన కుమార్తెను చూసేందుకు వెళితే మీకొచ్చిన ఇబ్బందేమిటని ఆమె పోలీసులను నిలదీశారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో... పోలీసుల చర్యను నిరసిస్తూ విజయమ్మ తన ఇంటిలోనే నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పోలీసుల ఎదుటే ఆమె దీక్షకు దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
YSRTP
YS Vijayamma
YS Sharmila
Telangana
TS Police
Hyderabad Police
Lotus Pond
Hyderabad
House Arrest

More Telugu News