భారత్ లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

29-11-2022 Tue 15:32 | National
  • బీహార్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్
  • దేశవాసులంతా భరతమాత బిడ్డలేనని వివరణ
  • అందరినీ ఏకం చేస్తోంది హిందుత్వమేనని వ్యాఖ్య 
RSS Chief Mohan Bhagwat says all Indians are Hindus
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ బీహార్ లోని దర్భంగా పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ 'నగర్ ఏక త్రికరణ్' కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, భారత్ లో నివసించే ప్రజలంతా హిందువులేనని అన్నారు. ఎందుకంటే, భారత్ లోని వారంతా భరతమాత పుత్రికలు, పుత్రులేనని వివరించారు. మనల్ని అందరినీ ఏకం చేస్తోంది హిందుత్వమేనని మోహన్ భగవత్ సూత్రీకరించారు. ఓ వ్యక్తి నిర్వర్తించాల్సిన బాధ్యతలను గుర్తు చేసేది మతమేనని, సరైన మార్గంలో నడవాలని మతం బోధిస్తుందని తెలిపారు. 

మేఘాలయలోని షిల్లాంగ్ లోనూ, చత్తీస్ గఢ్ లోని సుర్గుజా జిల్లాలోనూ ఆయన ఇవే వ్యాఖ్యలు చేశారు. భారత్ లో నివసించేవారు ఏ మత విశ్వాసాలు అనుసరించినా, వారు హిందువులే అవుతారని, ఎందుకంటే భారత్ లోని వారంతా ఒకే డీఎన్ఏను పంచుకుంటున్నారని వివరించారు.