ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు... కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి: ఏపీ మంత్రి అప్పలరాజు

29-11-2022 Tue 14:48 | Andhra
  • పలాసలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అప్పలరాజు
  • ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామన్న మంత్రి
  • ప్రతిపక్షాలు, మీడియా వైసీపీని ఏమీ చేయలేవని వ్యాఖ్య
  • అప్పలరాజు వ్యాఖ్యలను వారించిన ధర్మాన కృష్ణదాస్
ap minister seediri appala raju comments on elections
ఏపీలో అధికార వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమంటూ విపక్ష టీడీపీతో పాటు జనసేనలు చేస్తున్న వాదనలకు బలం చేకూరుస్తూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా తన సొంత నియోజకవర్గ కేంద్రం పలాసలో మంగళవారం అప్పలరాజు నూతనంగా నిర్మించిన తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చంటూ అప్పలరాజు వ్యాఖ్యానించారు. కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నామని కూడా ఆయన వైసీపీ శ్రేణులను ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేశారు. వైసీపీని ప్రతిపక్షాలతో పాటు ఆ పార్టీలకు వంత పాడుతున్న మీడియా కూడా ఏమీ చేయలేవన్నారు. ఇదిలా ఉంటే...ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్.. అప్పలరాజు వ్యాఖ్యలను వారించారు.