Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట.. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా చర్యలు వద్దన్న కోర్టు

  • పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలో అరెస్టయిన నారాయణ
  • నారాయణ బెయిల్ ను రద్దు చేసిన చిత్తూరు కోర్టు
  • ఈ నెల 30 లోగా లొంగిపోవాలని నారాయణకు ఆదేశాలు
  • చిత్తూరు కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన మాజీ మంత్రి
  • వాదనలు ముగిసినట్లు ప్రకటించి... తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
ap high court reserves verdict on tdp leader narayanas petition

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టులో ఒకింత ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా నారాయణపై ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తన బెయిల్ ను రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ హైకోర్టులో సవాల్ చేయగా... మంగళవారం హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇటు నారాయణతో పాటు అటు పోలీసుల వాదనలను విన్న హైకోర్టు... ఈ కేసులో వాదనలు ముగిసినట్లు ప్రకటించింది.

అయితే నారాయణ పిటిషన్ పై తీర్పును మాత్రం హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ పై తమ తీర్పు వెలువడే దాకా నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఇటీవలే నారాయణను పోలీసులు అరెస్ట్ చేయగా... చిత్తూరు న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కు సానుకూలంగా స్పందించిన చిత్తూరు కోర్టు... నారాయణ బెయిల్ ను రద్దు చేసింది. ఈ నెల 30లోగా లొంగిపోవాలని కూడా కోర్టు నారాయణను ఆదేశించింది. చిత్తూరు కోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తీర్పు వెలువడే వరకు నారాయణకు అరెస్ట్ నుంచి ఉపశమనం లభించింది.

More Telugu News