YS Sharmila: ప్రగతిభవన్ వైపు వెళ్లేందుకు షర్మిల యత్నం... కారును మినీ క్రేన్ తో లాక్కెళ్లిన పోలీసులు

  • నిన్న వరంగల్ జిల్లా చెన్నారావుపేట వద్ద ఉద్రిక్తతలు
  • షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలింపు 
  • పోలీసుల కళ్లు గప్పి ఇంటి నుంచి బయటికొచ్చిన షర్మిల
  • కారును మినీ క్రేన్ కు కట్టేసిన పోలీసులు
Police tows Sharmila car with traffic crane

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను నిన్న వరంగల్ జిల్లా చెన్నారావుపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆమెను పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. అయితే, షర్మిల ఇవాళ పోలీసుల కళ్లుగప్పి లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి బయటికి వచ్చారు. నిన్నటి దాడిలో అద్దాలు పగిలిన కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతిభవన్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. 

పోలీసులు ఆమెను పంజాగుట్ట సిగ్నల్స్ వద్ద అడ్డుకున్నారు. షర్మిలను కారు దిగాలని పోలీసులు కోరగా, ఆమె అందుకు నిరాకరించారు. వైఎస్సార్టీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో, పోలీసులు ఆమె కారును ఓ ట్రాఫిక్ క్రేన్ వాహనానికి కట్టేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు లాక్కొచ్చారు. షర్మిల కారు నుంచి దిగకపోవడంంతో పోలీసులు బలవంతంగా కారు డోర్లు తెరిచి ఆమెను పోలీస్ స్టేషన్ లోకి తరలించారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తనను ఈ విధంగా అడ్డుకోవడానికి సిగ్గుండాలని టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. పాదయాత్ర చేస్తుంటే అరెస్ట్ చేస్తారా... తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? టీఆర్ఎస్ లో ఉన్నది గూండాలు, రౌడీలే. ఈ సిగ్గులేని సీఎం ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా? అంటూ తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు.

More Telugu News