మార్చిలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

29-11-2022 Tue 14:11 | National
  • తమిళనాడులోని యూనిట్లో జనవరి నుంచి తయారీ మొదలు
  • ఎక్స్ షోరూమ్ ధర కొంత పెరగొచ్చన్న సంకేతం
  • ఒక్కసారి చార్జింగ్ తో 300 కిలోమీటర్ల ప్రయాణానికి వీలుగా అప్ డేట్
Simple One electric scooter launch in March 2023 Expected price hike
బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వచ్చే మార్చిలో విడుదల చేయనుంది. సింపుల్ వన్ స్కూటర్ ను ఈ సంస్థ లోగడ ఆవిష్కరించి బుకింగ్ లు తీసుకుంటోంది. తయారీ ఇంకా ప్రారంభం కాలేదు. 

తమిళనాడులోని షూలగిరి వద్ద రూ.100 కోట్ల పెట్టుబడితో సింపుల్ వన్ ఓ అతిపెద్ద ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా 10 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇక్కడ 2023 జనవరి 19న తయారీ మొదలు కానుంది. అనంతరం మార్చి నుంచి స్కూటర్లను డెలివరీ చేస్తుంది. కాకపోతే గతంలో రూ.1.10 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ధర ఉంటుందని పేర్కొనగా (సబ్సిడీల అనంతరం).. సరఫరా సమస్యల నేపథ్యంలో ఈ ధర కొంత పెరగొచ్చన్న సంకేతాలు ఇచ్చింది. రాష్ట్రాల సబ్సిడీలు కాకుండా ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.45 లక్షలుగా ఉంది. 

సింపుల్ వన్ ఒక్కసారి చార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ గతంలో పేర్కొనగా.. దీన్ని అప్ డేట్ చేసినట్టు, ఒక్కసారి చార్జ్ తో 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని చెబుతోంది.