YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసు విచారణను హైదరాబాదు సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం

Ys viveka murder case transeffered to hyderabad cbi court
  • విచారణపై మృతుడి భార్య, బిడ్డల అసంతృప్తి నేపథ్యంలో నిర్ణయమని వెల్లడి
  • బాధితుల ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకున్నామన్న ధర్మాసనం
  • సీబీఐ దాఖలు చేసిన ప్రత్యేక అఫిడవిట్ లోని అంశాలను ప్రస్తావించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. హత్య కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. దర్యాఫ్తుపై మృతుడి భార్య, కూతురు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇక్కడి (సుప్రీంకోర్టు) దాకా రావడం బాధాకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసు విచారణను బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్ వివేకా హత్య కేసులో అనేక కోణాలు ఉన్నాయని, ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు తప్పట్లేదని సీబీఐ వాపోయింది. విచారణాధికారులను కేసుల పేరుతో వేధింపులకు గురిచేశారని కోర్టుకు వెల్లడించింది. విచారణకు స్థానిక యంత్రాంగం అసలు ఏమాత్రం సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఈమేరకు కోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది.

దీంతోపాటు సీబీఐ ఆరోపణలకు వైఎస్ సునీత మద్దతు తెలపడం, హత్య కేసులో కుట్రను బయటపెట్టాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయడాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనకున్న కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం విచారణను కడప  కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.
YS Vivekananda Reddy
murder case
cbi court
Telangana
YSRCP
Andhra Pradesh

More Telugu News