బిగ్ బాస్: శ్రీసత్య విషయంలో రేవంత్ పై శ్రీహాన్ సీరియస్!

29-11-2022 Tue 11:04 | Entertainment
  • గతంలో శ్రీహాన్ ను కామెంట్ చేసిన రేవంత్
  • ఆ విషయం జనంలోకి వెళ్లిందని గ్రహించిన శ్రీహాన్ 
  • అలా మాట్లాడటం కరెక్టు కాదని రేవంత్ పట్ల అసహనం 
  • తన ఉద్దేశం అది కాదని చెప్పడానికి ప్రయత్నించిన రేవంత్
Bigg Boss 6  Update
బిగ్ బాస్ హౌస్ లో 84వ రోజున రేవంత్ - శ్రీహాన్ మధ్య మాటా మాటా పెరిగింది. శ్రీసత్య - శ్రీహాన్ చనువుగా మసలుకోవడం గురించి ఒకానొక సందర్భంలో రేవంత్ మాట జారాడు. అలా మాట్లాడటం కరెక్టు కాదని శ్రీహాన్ .. తాను వేరే ఉద్దేశంతో అనలేదని రేవంత్ .. ఇలా ఇద్దరి మధ్య ఈ సమస్య కొన్ని వారాలుగా నలుగుతూ, నిన్న పతాకస్థాయికి చేరుకుంది. 

నిన్న రేవంత్ .. శ్రీహాన్ .. శ్రీసత్య ఒక చోట కూర్చుని ఉండగా, మళ్లీ అదే అంశానికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. తాను పిలవగానే శ్రీహాన్ రాకపోవడం వలన తాను ఆ మాట అనవలసి వచ్చిందని వాళ్లకి రేవంత్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అలా అనడం కరెక్టు కాదనీ .. అది జనాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందంటూ శ్రీహాన్ అసహనాన్ని ప్రదర్శించాడు. 'నీ మాదిరిగానే నేను మాట్లాడితే మీ ఇంట్లో ఎన్ని గొడవలు అవుతాయో తెలుసా?" అంటూ కోపంగా అడిగాడు. బయటవాళ్లు వచ్చి కూడా అదే మాట చెబుతున్నారంటూ మండిపడ్డాడు. 

 తామిద్దరం స్నేహితులమే అయినప్పటికీ .. తమ మధ్యలో ఒక అమ్మాయి ఉందనే విషయం మరిచిపోవద్దనీ .. చూసే దృష్టిని మార్చుకోమని అంటూ శ్రీహాన్ సీరియస్ అయ్యాడు. జనాలకి ఎవరేం చేరవేయాలని అనుకుంటున్నారో నాకు తెలుసు" అనగానే రేవంత్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన ముక్కును .. నడక తీరును గురించి రేవంత్ కామెంట్స్ చేస్తున్నాడనీ, పూల చొక్కాలు వేసుకుంటే 'పూల రంగడు' అంటూ కామెంట్స్ చేశాడనీ, ఆమెను కూడా దృష్టిలో పెట్టుకుని తాను మాట్లాడుతున్నానని శ్రీ సత్యతో శ్రీహాన్ అన్నాడు.