Anupam Kher: ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా దరిద్రమన్న ఇఫీ జ్యూరీ.. అనుపమ్‌ఖేర్ స్పందన ఇదీ!

  • ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రోపగాండా, వల్గర్ సినిమాగా పేర్కొన్న నదావ్
  • ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో ఇలాంటి సినిమా ప్రదర్శన సరికాదన్న జ్యూరీ హెడ్
  • ముందస్తు ప్లాన్ ప్రకారమే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారన్న అనుపమ్ ఖేర్
  • బాధిత యూదుల వర్గానికి చెందిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం
 Anupam Kher On IFFI Jury Heads Remarks Shameful On The Kashmir Files

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి చిత్రాన్ని పట్టుకుని అదో ప్రచార ఆర్భాటమని, దరిద్రమైన సినిమా అంటూ నోరు పారేసుకున్న ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ నదావ్ లపిడ్‌పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గోవా వేదికగా జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి నదావ్ జ్యూరీ హెడ్‌గా ఉన్నారు. చిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ‘ప్రోపగాండా’, ‘వల్గర్ సినిమా’గా అభివర్ణించారు. ఈ సినిమా చూసి తామంతా కలవరపడ్డామని, దిగ్భ్రాంతికి గురయ్యామని అన్నారు. ప్రచార ఆర్భాటం కలిగిన అసభ్యకరమైన సినిమా అని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన చలనచిత్రోత్సవంలో కళాత్మక పోటీ విభాగానికి ఈ సినిమా ఎంపిక కావడం సముచితంగా అనిపించలేదన్నారు. ఈ వేదిక పైనుంచి తన భావాలను అందరితో పంచుకోదలిచానని పేర్కొన్నారు. విమర్శనాత్మక చర్చను కూడా ఆమోదించడమే ఈ చిత్రోత్సవం స్ఫూర్తి అని నదావ్ స్పష్టం చేశారు. 

నదావ్ వ్యాఖ్యలను బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్రంగా ఖండించారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కథానాయకుడిగా నటించిన ఆయన మాట్లాడుతూ.. ముందస్తు పథకం ప్రకారమే చలన చిత్రోత్సవంలో ఈ సినిమాపై విమర్శలు చేశారని, ఇది సిగ్గు చేటని అన్నారు. సినిమాపై నదావ్ వ్యాఖ్యల తర్వాత ‘టూల్‌కిట్ గ్యాంగ్’ (మానవహక్కుల కార్యకర్తలు) యాక్టివ్ అయిందన్నారు. కశ్మీరీ పండిట్ల వలస నేపథ్యంలో సినిమాను రూపొందించారని, మారణహోమానికి గురైన యూదుల వర్గానికి చెందని వ్యక్తి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. భగవంతుడు ఆయనకు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మారణహోమం సరైనది అయితే కశ్మీరీ పండిట్ల వలస కూడా సరైనదేనని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.

More Telugu News