Somireddy Chandra Mohan Reddy: ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ఆ ప్రకటన మోసపూరితమైనది: సోమిరెడ్డి

  • నేడు పత్రికా ప్రకటన ఇచ్చిన ఏపీ సర్కారు
  • అన్నీ తప్పుడు లెక్కలేనన్న సోమిరెడ్డి 
  • పత్రికా ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Somireddy slams Govt ad in news papers

సాక్షి పత్రికలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన పూర్తిగా మోసం అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేడు సాక్షి, ఈనాడులో ఫుల్ పేజ్ అడ్వర్ టైజ్ మెంట్ ఇచ్చిందని తెలిపారు. ఇందులో తామేదో ఘనకార్యాలు చేసినట్లుగా రాసుకున్నారని, అందులో అన్నీ తప్పుడు లెక్కలు ఇచ్చారని విమర్శించారు. 

"సున్నా వడ్డీ కోసం రూ.160 కోట్ల 55 లక్షలు ఇచ్చాం, ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.39 కోట్ల 39 లక్షలు ఇచ్చాం అని గొప్పలు చెప్పుకున్నారు. తెలుగుదేశం హయాంలో రైతు రుణం చెల్లించేటప్పుడు లక్ష రూపాయలు తీసుకుంటే లక్ష కట్టేస్తే చాలు. ప్రభుత్వం వడ్డీ కట్టేది. అయితే ఇప్పుడు  రైతు వడ్డీతో పాటు అసలు చెల్లించాల్సి వస్తోంది. 

తెలుగుదేశం హయాంలో 35 లక్షల మందికి 1719.36 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ చెల్లించేటట్లు చేశాం. ఇప్పుడు ఈ సంవత్సరం 8 లక్షల 22 వేల మందికి ఇచ్చాం అంటున్నారు. ఎవరైనా రైతు ఇబ్బందుల్లో ఉంటే గడువు తేదీ దాటిపోతే సున్నా వడ్డీ వర్తించడంలేదు. సున్నా వడ్డీ కింద ముందు ప్రభుత్వం కట్టాల్సింది వెంటనే కట్టాలి. ఆ తరువాత రైతులు రీయంబర్స్ మెంట్ చేస్తారు. 

మీ జగనన్న ప్రభుత్వం ఈ మూడేళ్ల 5 నెలల్లో  రైతన్నలకు అందించిన సాయం ఒక లక్షా 37 వేల 975 కోట్ల రూపాయలు అని పత్రికల్లో పేర్కొన్నారు. ఇది పచ్చి మోసం. ధాన్యం కొనుగోలు రూ. 48 వేల 793 కోట్లు అనటం అన్యాయం. ఇతర పంటలకు రూ.7,156 కోట్లు ఇచ్చామనడం పచ్చి మోసం. రెండూ కలిపి రూ. 58 వేల 950 కోట్లు ఉచితంగా రైతులకు ఇస్తున్నామని చెబుతున్నారు.  

ఉచిత విద్యుత్ కు రూ.27,800 కోట్లు అనడం దగా. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ రూ.2,647 కోట్లు అనడం రైతులను మోసం చేయడమే. పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందించామని చెబుతున్నారు. అసలు ఎండాకాలంలో కరెంటు సరఫరానే చేయలేదు. వైసీపీ ప్రభుత్వం 9 గంటలు కరెంటు 12 గంటలు సరఫరా చేస్తామని చెప్పి 7 గంటలు మాత్రమే ఇచ్చింది. దానికి రూ.1700 కోట్లు ఖర్చు పెట్టామనడం కూడా మోసమే. 

రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లింగ్ వేసి ఎఫ్ సీఐకి అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సివిల్ సప్లయిస్ ద్వారా ఇవ్వాల్సిన వారికి ఇచ్చుకుంటున్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అంతేగానీ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు దిక్కులేదు. రైతు ధాన్యం కొలిస్తే ఆరు నెలలకు కూడా డబ్బులు రావడంలేదు. నెల్లూరు జిల్లాలో 7 నెలలైంది. డబ్బులు ఇవ్వలేదు. 

ఈ మూడున్నర సంవత్సరాల్లో రూ. 1 లక్షా 37వేల 975 కోట్లు రైతులకు ఉచితంగా ఇచ్చామనడం, పత్రికల్లో పేర్కొనడం సిగ్గుచేటు. మొత్తం లెక్క వేయగా రూ.1 లక్షా 3 వేల 300 కోట్లు వచ్చింది. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి మోసపూరిత ప్రకటనలతో వంచిస్తున్నారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసి రూ.960 కోట్లు అప్పు పెట్టినట్లు, గత ప్రభుత్వం కరెంటు బాకీలు రూ.8,840 కోట్లు ఉన్నాయని చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి చేసి పోయిన అప్పు రోశయ్య కట్టారు. రోశయ్య అప్పు కిరణ్ కుమార్ రెడ్డి కట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి మిగిల్చి పోయిన అప్పులు చంద్రబాబునాయుడు కట్టారు. 

రూ.10 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ రూ.10 లక్షల కోట్లు ఎవరు కడతారు? మీరు చేసే పాపానికి వచ్చే ప్రభుత్వం కట్టాల్సిన అవసరముంది. బిందు తుంపర్ల సేద్యానికి, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల పెంపకంకు  రూ. 12 వందల కోట్లు ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో సూక్ష్మ సేద్యానికి 5 సంవత్సరాల్లో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశాం. మూడున్నర సంవత్సరాల తర్వాత డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ కు రూ.12 వందల 64 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఖర్చు చేసింది రూ. 600 కోట్లు. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకానికి రూ.690 కోట్లు ఖర్చు చేసినట్లు చూపిస్తున్నారు. రూ.3 వందల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మేము రూ.15 వందల కోట్లు ఖర్చు చేశాము. 


రైతు భరోసా పేరుతోనూ జగన్ రెడ్డి రైతులను దగా చేస్తున్నారు. రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తానని రూ.7,500 ఇచ్చారు. 52 లక్షల మంది రైతులకు రూ.25 వేల 970 కోట్లు ఇచ్చామంటున్నారు. దాంట్లో 50 శాతం ఇంచుమించు సెంట్రల్ గవర్నమెంటు డబ్బు ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో ఎకరాకు రూ.10 వేలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు పథకం ఇస్తుంటే మన రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద రూ.7, 500 ఇవ్వడం మోసం కాదా?

మేం రైతు రథం పథకం  కింద ట్రాక్టర్లు ఇచ్చాం. ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు ఇవ్వడం నేరం. ప్రజల్ని మోసం చేయడమే. వైసీపీ నాయకులు రైతుల పొలాల్లోకి వెళ్లి పరిశీలించడంలేదు. ఉచిత కరెంటు ఇప్పటి ప్రభుత్వం ఇచ్చేది కాదు... ఎప్పటి నుంచో ఇస్తున్నారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తుంటే మన రాష్ట్రంలో 7 గంటలే విద్యుత్ ఇస్తున్నారు. వెంటనే పత్రికల్లో ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. తీసుకోకుంటే  ప్రజల దృష్టిలో భ్రష్టుపట్టిపోతారు" అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

More Telugu News