Water: రోజుకు 2 లీటర్ల నీరు నిజంగా అవసరమా?

Do You Really Need To Drink Two Litres Of Water A Day New Study Says No
  • రోజుకు 1.5 లీటర్లు తాగినా సరిపోతుందంటున్న కొత్త అధ్యయనం
  • వయసు, ఇతర పరిస్థితుల ఆధారంగా పరిమాణంలో మార్పులు
  • వేడి ప్రాంతాల్లో నివాసం ఉండేవారు, గర్భిణులకు అధిక నీటి అవసరం
రోజులో కనీసం రెండు లీటర్ల నీరు అయినా తాగాలనేది ఎప్పటి నుంచో మనం వింటున్న మాట. అప్పుడే శరీరం తగినంత నీటి శాతంతో ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. కానీ, నిజానికి ప్రతి ఒక్కరికీ 2 లీటర్ల నీరు అవసరమా? అంతకంటే ఎక్కువ కావాలా? తక్కువ అయినా ఫర్వాలేదా? ఈ విషయాలను తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ శాస్త్రవేత్తలు ఇటీవలే ఓ పరిశోధన నిర్వహించారు. సైన్స్ జర్నల్ లో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి.

ఇందులో భాగంగా 23 దేశాలకు చెందిన 5,604 మంది రోజువారీ జీవనాన్ని పరిశీలించారు.  8 రోజుల నుంచి 96 ఏళ్ల వయసు వరకు వ్యక్తులను పరిగణనలోకి తీసుకున్నారు. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు (ఒక గ్లాస్ 250 ఎంఎల్) తాగాలన్నది అర్థవంతమైన సూచన కాదని వీరు అభిప్రాయానికి వచ్చారు. రోజులో 1.5 లీటర్ల నుంచి 1.8 లీటర్ల వరకు తీసుకుంటే సరిపోతుందన్నది వీరి పరిశీలన. 

వేడి ప్రాంతాలు, తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఉండే వారు, ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారు, అథ్లెట్లు, గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులకు మరింత నీరు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. వీరిలో వాటర్ టర్నోవర్ అధికమని చెప్పారు. వాటర్ టర్నోవర్ అంటే.. ఒక నిర్ణీత సమయంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేయడం. 20-35 ఏళ్ల వయసు పురుషులకు రోజువారీ 4.2 లీటర్లు, 20-40 వయసు మహిళలకు 3.3 లీటర్లు అవసరమన్నది వీరి అంచనా. 

రోజువారీగా కావాల్సిన మొత్తం నీటి పరిమాణం అనేది.. మనం తీసుకునే నీటితోపాటు ఆహారం రూపంలో వచ్చే దాన్ని కూడా కలిపి చూడాలని యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జాన్ తెలిపారు.  ఒకరి వాటర్ టర్నోవర్ కు సమానంగా నీరు అవసరపడదన్నారు. ‘‘ఉదాహరణకు 20 ఏళ్ల వ్యక్తి వాటర్ టర్నోవర్ రోజులో 4.2 లీటర్లుగా ఉంటే, 4.2 లీటర్ల నీటిని తాగాలని కాదు. ఇందులో 15 శాతం ఉపరితల నీటి మార్పిడి, జీవక్రియల నుంచి వస్తుంది. కనుక రోజులో 3.6 లీటర్ల నీరు తీసుకుంటే చాలు’’ అని జాన్ వివరించారు.
Water
drinking water
how much
daily need
new study

More Telugu News