Belgium: ఫిఫా ప్రపంచకప్: బెల్జియంను ఓడించిన మొరాకో.. బ్రసెల్స్‌లో చెలరేగిన అల్లర్లు

  • బెల్జియంను 2-0తో ఓడించిన మొరాకో
  • బ్రసెల్స్‌లో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న మొరాకో ఫ్యాన్స్
  • అల్లర్లను అదుపు చేసేందుకు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగం
  • వాహనాలను తగులబెట్టిన ఆందోళనకారులు.. 11 మంది అరెస్ట్
Clashes erupt in Brussels after Belgium loses World Cup match to Morocco

ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 0-2తో ఓటమి పాలయ్యాక ఆ దేశ రాజధాని బ్రసెల్స్‌లో అల్లర్లు చెలరేగాయి. బెల్జియంలో దాదాపు 5 లక్షల మంది మొరాకో వాసులు నివసిస్తున్నారు. మొరాకో చేతిలో బెల్జియం ఓటమి పాలయ్యాక.. మొరాకో జెండా కప్పుకున్న పలువురు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. 

మరోవైపు, ఈ ఘటన బ్రసెల్స్‌లోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు కారణమైంది. కొందరు దుకాణాల అద్దాలను పగలగొట్టారు. వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు.  

మ్యాచ్ ముగియడానికి ముందు పదుల సంఖ్యలో అభిమానులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారని, దీంతో ప్రజా భద్రతకు విఘాతం కలిగిందని పోలీసులు తెలిపారు. కొందరు అభిమానులు కర్రలతో కనిపించారని, రోడ్లపై బాణసంచా కాల్చడంతో ఓ జర్నలిస్టుకు గాయాలయ్యాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా మెట్రో స్టేషన్లను మూసివేశారు. అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు పాకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అలాగే, బెల్జియం తూర్పు నగరమైన లీగ్‌లో 50 మంది ముఠా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. అద్దాలను బద్దలుగొట్టింది. రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో పోలీసులు వాటర్ కేనన్లు ఉపయోగించి వారిని చెదరగొట్టారు.

More Telugu News