Gujarat: తోటి జవాన్లపైకి సైనికుడి కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

  • గుజరాత్ లో శనివారం రాత్రి ఘటన
  • ఎన్నికల విధుల్లో భాగంగా పోర్ బందర్ కు జవాన్లు
  • బస్సులో ప్రయాణిస్తుండగా జవాన్ల మధ్య గొడవ
  • మాటామాటా పెరగడంతో ఆవేశంతో కాల్పులు
Paramilitary Personnel On Gujarat Election Duty Shoots 2 Colleagues Dead

ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి గుజరాత్ వెళ్లిన జవాను ఒకరు తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ తగిలి ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోర్ బందర్ సమీపంలోని తుక్డా గోసా గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుందీ దారుణం. గుజరాత్ లో వచ్చే నెల 1, 5వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు పారామిలిటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఈ ఏర్పాట్లలో భాగంగా పోర్ బందర్ చేరుకున్న జవాన్లకు అధికారులు దగ్గర్లోని తుఫాను పునరావాస కేంద్రంలో విడిది ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శనివారం రాత్రి కొంతమంది జవాన్లు బస్సులో వెళుతున్నారు. ఆ సమయంలో జవాన్ల మధ్య వివాదం రేగింది. 

మాటామాటా పెరగడంతో కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్ తన ఏకే 47 తో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు తోయిబా సింగ్, జితేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరాజిత్, రోహికానా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వీరిని జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించినట్లు పోర్ బందర్ కలెక్టర్ ఏఎం శర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

More Telugu News