తాజా ప్రయోగాలతో స్టార్టప్ ల సిటీగా హైదరాబాద్ విశిష్టత మరింత పెరిగింది: సీఎం కేసీఆర్

26-11-2022 Sat 20:56 | Telangana
  • విక్రమ్-ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతం
  • రాకెట్ ను రూపొందించిన స్కైరూట్
  • పీఎస్ఎల్వీసీ-54 ద్వారా రెండు నానో శాటిలైట్ల ప్రయోగం
  • శాటిలైట్లను రూపొందించిన ధృవ స్పేస్ టెక్
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ 
CM KCR congratulates Skyroot Aerospace and Dhruva Space Tech startups
కొన్ని రోజుల కిందట స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లడం, ఇస్రో తాజాగా ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ-54 ద్వారా ధృవ స్పేస్ టెక్ స్టార్టప్ కు చెందిన రెండు నానో శాటిలైట్లు నిర్దేశిత కక్ష్యల్లోకి చేరడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. 

స్కైరూట్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ టెక్ స్టార్టప్ లు రెండు హైదరాబాదుకు చెందినవి కావడంతో కేసీఆర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్కైరూట్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ టెక్ సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. అంతేకాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో యువత నుంచి మెరుగైన ప్రతిభను వెలికితీస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ను అభినందించారు. 

దేశంలో ప్రైవేటు రంగంలో రాకెట్ ను పంపించిన తొలి స్టార్టప్ గా స్కైరూట్ చరిత్రలో నిలిచిపోతుందని, ధృవ సంస్థ పంపిన ఉపగ్రహాలు వాటికి నిర్దేశించిన కక్ష్యల్లోకి విజయవంతంగా చేరడం భారత స్టార్టప్ ల చరిత్రలో శుభదినం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో స్టార్టప్ ల నగరంగా హైదరాబాద్ విశిష్టత మరింత పెరిగిందన్నారు. 

ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్ లు మరిన్ని ఘనతలు సాధిస్తాయన్న నమ్మకం తనకుందని స్పష్టం చేశారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే యువతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉద్ఘాటించారు.