రాజమౌళి ముఖ్య అతిథిగా 'హిట్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్!

26-11-2022 Sat 19:42 | Entertainment
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడిచే 'హిట్ 2'
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్
  • కథానాయికగా నటించిన మీనాక్షి చౌదరి 
  • ఈ నెల 28వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • డిసెంబర్ 2వ తేదీన విడుదల కానున్న సినిమా
HIT 2 Pre Release Event Update
అడివి శేష్ హీరోగా నాని నిర్మాణంలో 'హిట్ 2' సినిమా రూపొందింది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వచ్చాయి. ఒక యువతి మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కీ, ఆ హత్యతో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. అప్పుడతను ఏం చేశాడనేదే కథ. 

డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు. ముఖ్య అతిథి ఎవరనే విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు. తాజాగా సస్పెన్స్ కి తెరదించేస్తూ, చీఫ్ గెస్టుగా రాజమౌళి రానున్నారనే విషయాన్ని ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

ఈ నెల 28వ తేదీన హైదరాబాదు - ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. రాజమౌళితో నానికి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన నాని ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడన్న మాట. ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికగా మీనాక్షి చౌదరి నటించింది.