చంద్రబాబు, లోకేశ్ లపై అసభ్యంగా మాట్లాడిన తోపుదుర్తి చందును అరెస్ట్ చేయాలి: వర్ల రామయ్య

26-11-2022 Sat 19:09 | Andhra
  • మంగళగిరి టీడీపీ ఆఫీసులో వర్ల రామయ్య ప్రెస్ మీట్
  • వైసీపీ ఎమ్మెల్యే సోదరుడిపై ఆగ్రహం
  • మనిషా? పశువా? అంటూ మండిపడిన వర్ల రామయ్య
Varla Ramaiah demands DGP to arrest Thopudurthi Chandu
సీఎం జగన్ కు ఏమాత్రం నైతికత ఉన్నా, అసభ్య పదజాలంతో, పశువుకంటే హీనంగా చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబసభ్యుల్ని దూషించిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, అతని సోదరుడు చందుని, జగన్ రెడ్డి తక్షణమే పార్టీ నుంచి తప్పించాలని స్పష్టం చేశారు. 

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీవారిని అరెస్ట్ చేసే డీజీపీకి ఎమ్మెల్యే సోదరుడి బూతుపురాణం కనిపించలేదా? అని నిలదీశారు. తోపుదుర్తి చందుపై తక్షణమే సుమోటోగా కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం అని ఉద్ఘాటించారు. 

“పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు, చేతగానివాడు కాబట్టే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, తండ్రి వయస్సున్న వ్యక్తిని, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న మనిషిని, ఆయన కుమారుడు లోకేశ్ ను, కుటుంబసభ్యుల్ని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు ఇష్టానుసారం దూషించినా చర్యలు తీసుకోలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డే తన పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 

రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు పశువుకంటే హీనంగా మాట్లాడాడు. పశువులు కూడా సిగ్గుపడేలా ఆ భాష ఉంది. రాష్ట్ర ప్రజలు ఆ ఘోరకలి చూసి, వినలేరనే ఎమ్మెల్యే సోదరుడి బూతుల వీడియోను చూపించడంలేదు. 

ఇక, లోకేశ్ మా టార్గెట్ అంటున్నారంటే, వారి ఉద్దేశం లోకేశ్ ను చంపేస్తామనా? లోకేశ్ ను చంపేస్తామంటున్న పశుప్రాయులది అసలు మానవజన్మేనా? లోకేశ్ బాబు పేరు చెబితే ఎందుకు కొంతమంది వైసీపీ నేతల దుస్తులు తడుస్తున్నాయి? లోకేశ్ మీ తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే స్థితిలో లేడు, ఆ కుర్రాడు చాలా రాటుదేలిపోయాడని తెలుసుకోండి. 

జాకీ కంపెనీ పారిపోవడానికి రాప్తాడు ఎమ్మెల్యే కారణమని పత్రికల్లో వార్త వస్తే, దానిపై చట్టపరంగా ముందుకెళ్లాలి గానీ, చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని బూతులు తిడతారా? డీజీపీ తక్షణమే ప్రకాశ్ రెడ్డి సోదరుడిపై కేసుపెట్టి, వెంటనే అరెస్ట్ చేసి, బహిరంగ ప్రకటన చేయాలి. అతనిలానే టీడీపీవారు ఎవరైనా మాట్లాడి ఉంటే, రాజేంద్రనాథ్ రెడ్డి ఊరుకునేవాడా? 

తనపార్టీవారు, ప్రభుత్వంలోని వారు అశ్లీలంగా బూతులతో పేట్రేగిపోవడానికి జగన్మోహన్ రెడ్డే కారణం. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుగారిని ఉద్దేశించి, “చంద్రబాబుని చెప్పుతో కొట్టాలి, నడిరోడ్డుపై కాల్చిచంపాలి, చంద్రబాబుని బంగాళాఖాతంలో కలిపేయాలి, గ్రామాల్లో తిరిగితే చంద్రబాబుని రాళ్లతో కొట్టండి, అవసరమైతే బాబుకాలర్ పట్టుకుంటా, బాబూ... బావిలో దూకిచావు” అన్నాడు. 

అధినాయకుడు బరితెగించి మాట్లాడితే, అతనిపార్టీవారు అశ్లీలత, అసభ్యతతో మాట్లాడకుండా నీతివాక్యాలు చెబుతారా?  మేం కూడా మీలాగా మాట్లాడగలం జగన్మోహన్ రెడ్డిగారు... కానీ మా తల్లిదండ్రులు మమ్మల్ని సభ్యత సంస్కారంతో మాట్లాడటం నేర్పించారు" అంటూ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.