వివేకా హత్య కేసులో వాళ్లను కూడా విచారించమంటూ శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం

26-11-2022 Sat 17:31 | Andhra
  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
  • గత ఫిబ్రవరిలో తులసమ్మ పిటిషన్
  • నేడు పులివెందుల కోర్టులో వాంగ్మూలం
  • మరో ఆరుగురిని కూడా విచారించాలన్న తులసమ్మ
Viveka murder accused Sivasankar Reddy wife give her statement in Pulivendula Court
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో హాజరయ్యారు. 

మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసులో ఇంకా ఆరుగురిని విచారించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బీటెక్ రవి, వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలను  కూడా ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. తులసమ్మ గత ఫిబ్రవరిలో పిటిషన్ దాఖలు చేయగా, ఇన్నాళ్లకు ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. 

కాగా, ఈ కేసులో ఆర్థిక అంశాలతో పాటు కుటుంబ వివాదాలు కూడా ముడిపడి ఉన్నాయని, సీబీఐ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ తన వాంగ్మూలంలో వివరించారు.