సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు చెబితే నిలిపివేస్తాం: ధర్మాన ప్రసాదరావు

26-11-2022 Sat 16:52 | Andhra
  • సంక్షేమ పథకాలను టీడీపీ నేతలు తప్పుబడుతున్నారన్న ధర్మాన 
  • సీఎం తీసుకువచ్చిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరణ
  • ఎన్నికలు లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నామని వెల్లడి 
Dharmana slams opposition leaders
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ నేతలు తప్పుబడుతున్నారని విమర్శించారు. పథకాలంటూ డబ్బులు వెదజల్లుతున్నారని విమర్శలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు చెబితే నిలిపివేస్తామని ధర్మాన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

ఎన్నికలు లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నామని వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగింది ఒక్క ఏపీలోనే కాదని, దేశమంతా ఒకే రకంగా ఉన్నాయని ధర్మాన పేర్కొన్నారు.

ధర్మాన ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు.